Sunday, November 3, 2024

ధాన్యం కొనుగోళ్ళలో బడా మిల్లర్ల మాయాజాలం

నిజామాబాద్‌ బ్యూరో, ప్రభన్యూస్ : ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ వానాకాలం పంటకు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. జిల్లాలో 450 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కొనుగోళ్ళ ప్రక్రియ నత్తనడకన సాగుతుంది. అధికారులు సమీక్షా సమావేశంలో చెప్పినట్లుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపించడం లేదు. రైతులు ధాన్యంను మిల్లులకు చేర్చే దాకా నిలువు దోపిడికి గురి కావడంతో పాటు రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రతి యేటా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పర్సంటేజీల‌కు అలవాటుపడిన అధికారులు, రైస్‌ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా.. తమకేమి పట్టనట్లుగా ఉంటున్నారు. ముఖ్యంగా రైస్‌మిల్‌ అసోసియేషన్‌ దశాబ్ధాల కాలంగా తమ చెప్పు చేతల్లో పెట్టుకున్న అరడజన్‌ మంది మిల్లర్లు కనుసైగల్లోనే జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాగుతుంది. ఏయే మిల్లుకు ఎంతెంత ధాన్యం కేటాయించాలి, ఏ ధాన్యం కేటాయించాలో రైస్‌మిల్‌ అసోసియేషన్‌ నాయకులే కనుసైగలతో ఖరారు చేస్తున్నారు. ధాన్యం సేకరణపై ఏసీ గదుల్లో గంటల తరబడిగా ఉపన్యాసాలు దంచుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం మిల్లర్ల ఒత్తిడిని కాదనలేని పరిస్థితి నెలకొంది. తమకు అనుకూలంగా ఉన్న మిల్లులకే ధాన్యం ఎక్కువ మొత్తంలో కేటాయించే విధంగా అసోసియేషన్‌ పెద్దలు చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా సన్నవడ్లు, దొడ్డు వడ్లను రైస్‌మిల్లులకు కేటాయించే విషయంలో బడామిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై అసోసియేషన్‌లోనూ, మిల్లర్ల మధ్య వాగ్వివాదాలు జరుగుతున్నట్లు సమాచారం. కొందరు అసోసియేషన్‌ను తమ చెప్పు చేతల్లో పెట్టుకున్న ఒకరిద్దరు పెద్దలు తమ మిల్లులకు సన్నవడ్లనే ఎగేసుకపోతున్నారు. మిగితా వాటికి రెండు సంచుల దొడ్డు వడ్లు, ఒక సంచి సన్నం వడ్లు చొప్పున కేటాయిస్తుండగా వీరు మాత్రం అచ్చంగా సన్నవడ్లనే తమ మిల్లులకు తరలిస్తున్నారు. తమ మిల్లుకు సంబంధించి సామర్థ్యం మేరకు ధాన్యంను తరలించిన తర్వాతే మిగితా మిల్లులకు ధాన్యం కేటాయించే విధంగా చక్రం తిప్పుతున్నారు. అసోసియేషన్‌ తరపున పెద్ద మొత్తంలో అధికారులకు మామూళ్ళు ఇచ్చే ఆనవాయితీ దశాబ్ధాల కాలంగా వస్తుంది. అందుకే అధికారులు సైతం అసోసియేషన్‌ పెద్దలు గీసిన గీతను దాటలేని పరిస్థితిలో ఉన్నారు. జిల్లాలో వానాకాలం పంటకు సంబంధించి సుమారు 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తున్నట్లు అంచనా వేసిన అధికారులు ఆలస్యంగానైనా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యంను సేకరించే పనిని మొదలుపెట్టారు.

కానీ క్షేత్రస్థాయిలో ధాన్యం సేకరణ ప్రక్రియ అధికారులు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. పైగా ఎప్పటిలాగే తాలు, తేమ పేరుతో వంద కిలోల వడ్ల బస్తాల్లో 5 నుంచి 7 కిలోలు తరుగు పేరుతో కొట్టేస్తున్నారు. నిజానికి రెండు కిలోలకే తరుగు పరిమితం కావాలని అధికారులు పైకి పదే పదే చెబుతున్నప్పటి కి కింది స్థాయిలో నిర్ధాక్షిణ్యంగా రైతుల ధాన్యంను దోచుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలతో పాటు మిల్లర్లు సైతం తరుగు పేరుతో రైతులను నిలువునా ముంచేస్తున్నారు. గతేడాది యాసంగి పంటకు సంబంధించి కోట్లాది రూపాయల విలువైన ధాన్యంను తరుగు పేరుతో దోచేసిన మిల్లర్లు ఈసారి కూడా అదే తంతుకు శ్రీకారం చుట్టారు. తరుగు పేరుతో మిల్లర్లు ఇష్టారీతిన ధాన్యంలో కోత విధించకుండా యంత్రాంగం కట్టడి చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవేమి కనిపించడం లేదు. తరుగుపై నిలదీసే రైతుల ధాన్యాన్ని లారీల నుంచి దించుకోవడానికి సైతం మిల్లర్లు ససేమిరా అంటున్నారు. ఆకాశంలో మబ్బులు కమ్మేసి వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారిన నేపథ్యంలో రోడ్లపైన ధాన్యంను ఎక్కువ రోజులు ఉంచితే తీవ్రంగా నష్టపోతామనే ఆందోళనతో మిల్లర్లు తరుగు పేరుతో ఎన్ని కిలోలు దోచినా కిమ్మనకుండా రైతులు ధాన్యంను అమ్ముకునే పరిస్థితి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement