Thursday, November 21, 2024

ఇక కొలువుల జాతరే.. కేసీఆర్‌ ప్రకటనతో నిరుద్యోగుల్లో చిగురించిన ఆశలు..

హైదరాబాద్‌, (ప్రభన్యూస్): సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులకు శుభవార్త వినిపించారు. తర్వలోనే 60 నుంచి 70 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. సీఎం చేసిన ప్రకటనతో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మళ్లి కదిలిక మొదలైంది. త్వరలోనే వరుస నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగులను సర్దుతున్నామని కేసీఆర్‌ చెప్పడమే కాకుండా ఒకట్రెండు రోజుల్లో ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహిస్తామని కూడా చెప్పడం గమనార్హం.

అదేవిధంగా నవంబర్‌లో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. అంతేకాకుండా ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేస్తామని కూడా సీఎం ప్రకటించారు. సీఎం ప్రకటనను బట్టి చూస్తే డిసెంబర్‌ లేదా కొత్త ఏడాదిలో తొలి ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం ఖాళీల సంఖ్యపై ప్రభుత్వానికి ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అందిన సమాచారంతో ఆర్థిక శాఖ ఖాళీల సంఖ్యను ఫైనల్‌ చేసినట్లుగా తెలిసింది.

ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగాలను మినహాయించగా రాష్ట్రంలో మొత్తం పోస్టుల సంఖ్య దాదాపు 50వేల వరకు ఉన్నట్లు ప్రభుత్వం అంచనాకు వచ్చినట్లు సమాచారం. అన్ని ఉద్యోగాలకు ఒకే సారి నోటిఫికేషన్లు విడుదల చేస్తారా? లేక విడతల వారీగా నోటిఫికేషన్ల జారీ చేస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement