మక్తల్, జూన్ 27(ప్రభన్యూస్) : అమ్మవారి ఆలయం వద్ద పాము ఉందని, పాముకు పాలు పోయమని చెప్పి అమ్మవారి మెడలోని బంగారు హారాన్ని గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసిన సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో చోటు చేసుకుంది. ఆలయ పూజారి నాగేందర్ స్థానిక భక్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మక్తల్ పట్టణంలోని భక్తుల పాలిట కొంగుబంగారమై బాసిల్లుతున్న శ్రీ శ్రీ శ్రీ నల్ల జానమ్మ అమ్మవారి ఆలయం వద్ద మంగళవారం రోజు భక్తుల రద్దీ ఉంటుంది. ఇదే సమయంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆలయానికి వచ్చి పూజారి నుండి ప్రసాదం స్వీకరించాడు. అమ్మవారి మెడలో ఉన్న హారాన్ని ఎలాగైనా దొంగిలించాలని అప్పటికే మనసులో నిర్ణయించుకున్న అగంతకుడు ఆలయం వద్ద (అమ్మవారి పాదుకల వద్ద) పాము ఉందంటూ నమ్మించారు. అమ్మవారి దర్శనం అనంతరం బయటకు వెళ్లి ఆలయం ముందు భాగంలో ఓ దుకాణంలో పాల ప్యాకెట్ తీసుకువచ్చి పాలు పోయమంటూ పురమాయించారు.
పాము సాధారణంగా వస్తూనే ఉంటుందని పూజారి ఎంత చెప్పినా లేదు. పాముకు పాలు పోయాలంటూ పట్టుబట్టాడు. అదే సమయంలో పూజారి టాయిలెట్ కోసం బయటకు వెళ్తూ ఆలయం వద్ద కాపలాగా అక్కడే ఉంటున్న స్వీపర్ ను ఉంచి వెళ్ళాడు. ఇంతలో ఆగంతకుడు స్వీపర్ వద్దకు వచ్చి పాముకు పాలు పోయాలంటూ పాల ప్యాకెట్ చేతికి ఇచ్చాడు. ఆమె ఎంత చెప్పినా.. లేదు పోసి రండి నేను ఇక్కడే ఉంటాను అంటూ నమ్మించి స్వీపర్ పాల ప్యాకెట్ తో గుడి ముందుకు వెళ్లేసరికి గర్భాలయంలో చొరబడి అమ్మవారి మెడలో ఉన్న రెండు తులాల బంగారు హారాన్ని దొంగిలించి అక్కడి నుండి నిదానంగా పరారయ్యాడు. టాయిలెట్ కు వెళ్లిన పూజారి నాగేందర్ తిరిగి వచ్చి గర్భాలయంలోకి వెళ్లి భక్తులకు హారతిచ్చే సమయంలో అమ్మవారి మెడలో ఉన్న బంగారు హారం కనిపించకపోవడాన్ని గుర్తించారు. దీంతో విషయాన్ని భక్తులకు తెలియజేశాడు. అమ్మవారి ఆలయంలో చోరీ జరిగిన సంఘటన తెలిసి భక్తులు ఆలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ విషయంపై పూజారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్థానిక ఎస్సై పర్వతాలు ఆలయాన్ని సందర్శించి పరిశీలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పర్వతాలు తెలిపారు.