Friday, November 8, 2024

ములుగు జిల్లా మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

వాజేడు, ( ప్రభ న్యూస్ ) : ములుగు జిల్లాలోని వాజేడు మండల కేంద్రంలో ఈ రోజు మిర్చి తోటలను సిపిఎం తెలంగాణ రైతు సంఘం సంయుక్తంగా సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ… ములుగు జిల్లా వ్యాప్తంగా సుమారుగా 40 వేల ఎకరాలలో అతిపెద్ద వాణిజ్య పంట సాగవుతోంది. మిర్చి పంటకు ఒక ఎకరం పెట్టుబడి ఖర్చు సుమారుగా రెండున్నర లక్షల నుండి 3 లక్షల వరకు పెట్టుబడి ఖర్చవుతుందని రైతులు పరిశోధన బృందానికి వివరించారు. ఈరోజు వరకు మిర్చి పంట వేసి సుమారుగా 60 నుంచి 70 రోజులు కావస్తోంది. ఇంకో 30 నుంచి 50 రోజుల మధ్యలో పంట చేతికొచ్చే సమయంలో వేరు కుళ్లు తెగులు విల్ట్ వైరస్ తో మిర్చి పంటలు చనిపోవడం జరుగుతుంది. ఏమీ తోచని స్థితిలో మిర్చి రైతులు దిగులుతో ఉన్నారు. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు రైతులకు ఎలాంటి నష్టపరిహారం కంపెనీ వాళ్ళు ఇవ్వడం లేదు.

కంపెనీలు కూడా ఎకరానికి రెండు లక్షలకు తగ్గకుండా నష్టపరిహారం ఇవ్వాలని, ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడితో కూడుకున్న మిర్చి పంటలను రైతులు సాగుచేస్తుంటే కనీసం ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో మిర్చి కొనుగోలు కేంద్రాలు లేక దాచుకోడానికి కోల్డ్ స్టోరేజ్ లు లేక… ఎప్పుడో 100 కిలోమీటర్ల దూరంగా ఉన్న ఎనుమాముల మార్కెట్, ఖమ్మం మార్కెట్ పైనే ఆధారపడి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి రైతులకు ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ ను అలర్ట్ చేసి వైరస్ తో చనిపోయిన తోటలన్నీ కూడా సర్వే చేసి ఒక ఎకరానికి రెండు లక్షలకు తగ్గకుండా నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా పండిన పంటలకు మార్కెట్ సౌకర్యం ఐటీడీఏ కేంద్రంగా ఏర్పాటు చేయాలని, 40 వేల ఎకరాల మిర్చి సాగుకు అవసరమయ్యే శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయాలని, ఐటీడీఏ కేంద్రంగా మిర్చి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి ములుగు జిల్లా మిర్చి రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు తుమ్మల వెంకటరెడ్డి, దబ్బ కట్ల లక్ష్మయ్య, కొప్పుల రఘుపతి, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిట్టం ఆదినారాయణ, ఎండి గపూర్, కంట్టెం సత్యం కృష్ణ బాబు, మిర్చి రైతులు సీతారామరాజు, జగన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement