తెలంగాణ ప్రభుత్వం 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించడం హర్షనీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అర్. కృష్ణయ్య అన్నారు. లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లకు వెళ్లడం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు సాధ్యం కాదని, అందుకు ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ఉచితంగా కోచింగ్ ఇప్పించాలన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఒక గ్రూప్ -1కు ప్రయివేట్ కోచింగ్ సెంటర్లు రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకు వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు. మిగతా ఉద్యోగాలకు కూడా రూ. వేలల్లోనే వసూలు చేస్తున్నారన్నారు. వివిధ స్టడీ సర్కిళ్లలో దాదాపుగా 5 లక్షల మందికి కోచింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని 13 యూనివర్సిటీలలో కూడా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం పేద విద్యార్థులకు కోచింగ్ ఇప్పించకపోతే.. ఉద్యోగాలు డబ్బులున్న వారే తన్నుకుపోతారని ఆయన తెలిపారు.