ప్రభ న్యూస్, హైదరాబాద్ : ప్రభుత్వం ఒకవైపు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తామని చెబుతూనే.. సర్కార్ బడుల పట్ల నిర్లక్ష్యవైఖరిని ప్రదర్శిస్తోంది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 13నుంచి పాఠశాలలు వేసవి సెలవులు అనంతరం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయినా ఇప్పటి వరకు పుస్తకాలు రాకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పుస్తకాల ముద్రణ ఆలస్యం కావడంతో అధికారులు ఏమి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.
దీంతో ప్రభుత్వం ఇప్పటికే బ్రిడ్జికోర్సు పేరుతో 2021-22 విద్యా సంవత్సరంలో విద్యార్థులు చదివిన తరగతులకు సంబంధించిన పాఠ్యపుస్తకాల్లోని పాఠాలనే మళ్లి బోధించాలని సూచించినట్లు సమాచారం. తర్వాత పుస్తకాలు పంపిణీ ప్రక్రియను చేపట్టి.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సరైనరీతిలో పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేపడతామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అయినా పుస్తకాలు, దుస్తుల కొరత తీవ్రంగా వేధిస్తుండటంతో అనేక మంది విద్యార్థులు బ్రిడ్జికోర్సు తరగతులకు గైర్హాజర్ అవుతున్నట్టు తెలుస్తోంది.
రాజధాని హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ఉపాధ్యాయులను భర్తీ చేయకపోవడంతో పాటు పదోన్నతలు సైతం కల్పించక పోవడంతో ప్రాథమిక, ప్రాథమికొన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు అధికారిక సమాచారం. దీనికి తోడు విద్యా వాలంటీర్ల నియామకానికి సైతం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులకు తిప్పలు తప్పక పోవచ్చనే ప్రచారం జరుగుతోంది. విద్యార్థులకు పాఠాలు బోధించాలంటే తీవ్ర సమస్యలు ఎదుర్కొవాల్సిన దుస్థి తి నెలకొంది. ఇప్పటికే రాజ్ భవన్‌లాంటి పాఠశాలను ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.