Sunday, November 3, 2024

TG: రుణ‌మాఫీ పేరుతో రైతుల‌ను మ‌భ్య‌పెడుతున్న ప్ర‌భుత్వం … వేముల ప్ర‌శాంత్ రెడ్డి

రుణమాఫీ పేరిట రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతు సంక్షేమం గురించి కాంగ్రెస్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందన్నారు. కేసీఆర్ ఏమీ చేయలేదు.. మేమే అంతా చేస్తున్నామ‌నే భ్రమలను వీడి వాస్తవ ప్రపంచంలోకి రావాల‌న్నారు.

కేసీఆర్ రైతు బంధు, రైతు భీమా, 24 గంటల నాణ్యమైన కరెంట్, 100 శాతం ధాన్యం కొనుగోలు, రెండు సార్లు 28,000 కోట్ల రుణమాఫీ, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలను చేసి ఐక్య రాజ్యసమితి, ప్రపంచ దేశ ప్రశంశలు పొందారన్నారు. 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ రైతుబంధు, రైతు బీమా ఎందుకు ఇవ్వలేదు ? అని ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు.. డిసెంబర్ 9న చేయవలసిన రూ.2 లక్షల రుణమాఫీని 7 నెలలు ఆలస్యం చేసి, రైతులందరికీ 31 వేల కోట్లు మాఫీ అని చెప్పి కొంతమంది రైతులకు మాత్రమే కేవలం 6వేల కోట్లు మాఫీ చేసి సంబరాల పేరుతో రైతును మోసం చేస్తుందన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వానాకాలం సీజన్ కు ఎకరానికి రూ.7500 ల చొప్పున రైతు భరోసా కింద ఇవ్వాల్సిన రూ.11,250 కోట్లు ఎగ్గొట్టి, ఆ డబ్బుల్లో నుండే రుణమాఫీ కింద 6,098 కోట్లు విదిల్చి ఏదో ఘనకార్యం చేసినట్టు ప్రకటనలతో గ్లోబల్ ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని, ఈ మోసానికి రైతులు సంబరాలు చేసుకోవాలా ? అని ప్రశ్నించారు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో గత కేసీఆర్ ప్రభుత్వంలో 2016 లో మొదటి సారి లక్ష లోపు రుణాలు కలిగి ఉన్న 3,79,520 మంది రైతులకు 1,576 కోట్లు రుణమాఫీ చేశారన్నారు. 2018లో రెండవ సారి ఉమ్మడి జిల్లాలో లక్ష లోపు రుణాలు కలిగి ఉన్న 1,95,657మంది రైతులకు 942 కోట్ల రుణమాఫీ చేశారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎకరానికి రూ.7,500 చొప్పున ఈ సీజన్ డబ్బులు రూ.11,500 కోట్లు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, ఆగష్టు 15 లోపు కండిషన్స్ లేకుండా అర్హులైన మొత్తం 60లక్షల మంది రైతులందరికీ 2లక్షల వరకు రుణమాఫీ చేయాలన్నారు. రేషన్ కార్డులు లేని రైతులకు, మామిడి, నిమ్మ, బత్తాయి తోటలు సాగు చేసే రైతులకు, అవసరాల కోసం ఇన్కమ్ టాక్స్ కట్టే రైతులకు, చిన్న ఉద్యోగాలు చేసుకొనే రైతు కుటుంబాలకు, చిన్న వ్యాపారాలు చేసుకొనే రైతు కుటుంబాలకు కూడా రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement