Tuesday, November 19, 2024

TS: అత్యధిక మంది క్రీడాకారులు ఒలంపిక్ లో ఆడేలా తీర్చిదిద్దడమే ధ్యేయం… శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, అక్టోబర్ 3 (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్రం నుండి అత్యధిక మంది క్రీడాకారులను ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనేలా చేయటమే తమ ధ్యేయమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మహబూబ్ న‌గర్ జిల్లా, హన్వాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేసీఆర్ క్రీడ సామాగ్రి కిట్ల రాష్ట్ర స్థాయి పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… క్రీడలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పేరు, ప్రఖ్యాతులు సంపాదించడమే కాకుండా, ప్రతి వ్యక్తి రాష్ట్రంలో ఆరోగ్యవంతంగా జీవించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే మూడున్నర సంవత్సరాల క్రితం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలన్న తమ ఆలోచనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తోడ్పాటును అందించడంతో రాష్ట్రంలో మొదటి విడత 18 వేలు గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని, ఇప్పుడు సుమారు 25 వేల గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు.

దేశంలోనే అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు, క్రీడా సామాగ్రిని పంపిణీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందని వెల్లడించారు. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు సీఎం కప్ క్రీడలను కొనసాగిస్తామని తెలిపారు. ఒకప్పుడు మహబూబ్ న‌గర్ జిల్లా కరువు, కాటకాలతో, వలసలతో అల్లాడిపోయేదని, 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపీగా ఉన్న సమయంలో స్వయంగా వీటన్నిటిని చూశారని, అలాంటి జిల్లాను రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జిల్లా రూపురేఖలు మార్చడం జరిగిందని చెప్పారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సహకారంతో అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి పథకాలకు రూపకల్పన చేయగా, అధికారులు ఒక జట్టుగా ఏర్పడి అమలు చేస్తున్నందున ఆయన అధికారులు, సిబ్బందిని అభినందించారు. జిల్లాలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఐదు రిజర్వాయర్లు పూర్తి చేయడం జరిగిందని, జిల్లా ప్రజలు వలసపోకుండా ఇక్కడే ఉండేలా ఉమ్మడి మహబూబ్ న‌గర్ జిల్లాను సత్యశ్యామలం చేస్తున్నామని తెలిపారు.

భవిష్యత్తులో పాలమూరులో జన్మించి ఉంటే బాగుండేదని ప్రతి ఒక్కరికీ అనిపించే విధంగా చేస్తామన్నారు. క్రీడాకారులు సామాగ్రిని వినియోగించుకోవాలని కోరారు. క్రీడలతో పాటు పర్యాటక శాఖ ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామాలను గుర్తింపు తీసుకువచ్చామని, ఆర్కియాలజీ ద్వారా గుర్తింపు తెస్తున్నామని, అదేవిధంగా యువజన శాఖ ద్వారా 50వేల మందికి ఉద్యోగాలు కల్పించామని, ఎక్సైజ్ శాఖ ద్వారా నాలుగు కోట్ల 30లక్షల ఈత చెట్లు పెంచామని తెలిపారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి స్పోర్ట్స్ కిట్స్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రం లేదని తెలిపారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్న గొప్ప ఆశయంతో చేపట్టిన ఈ పథకం ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ కి దక్కుతుందన్నారు. క్రీడా సామాగ్రి పంపిణీ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతకుమారి మాట్లాడుతూ… ఒకప్పుడు కరువు, కాటకాలకు నిలయంగా ఉన్న మహబూబ్ నగర్ జిల్లా ఎవరు నమ్మటానికి వీలులేని విధంగా అభివృద్ధి చెంది రూపురేఖలు మారిపోయాయన్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా పచ్చదనం, చెట్లు, చెరువులు మత్తడి దుంకుతున్నాయని అన్నారు. తన సర్వీస్ లో కరువుతో పాటు, కలకలలాడే పాడిపంటలను రెండు మహబూబ్ నగర్ జిల్లాలో చూశానన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా 18000 పైగా గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని, 25వేల కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్ లను పంపిణీ చేస్తున్నామని, ఒక్కొక్క కిట్టులో 50వేల రూపాయల పైబడిన విలువైన క్రీడా సామాగ్రి ఇందులో ఉన్నాయన్నారు. వీటితో పాటు టీ షర్టులను సైతం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ జి .రవి నాయక్ మాట్లాడుతూ… రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటులో భాగంగా జిల్లాలో అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు పూర్తి చేసుకున్నామని, ఇప్పుడు కేసీఆర్ క్రీడాకిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. జిల్లాకు 369 కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లు వచ్చాయని, కిట్లతోపాటు 75 టీ షర్ట్లు కూడా ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం మంత్రి వాలీబాల్, కబడ్డీ క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ లక్ష్మి, రెవెన్యూ అదనపు కలెక్టర్లు ఎస్.మోహన్ రావు, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, హన్వాడ ఎంపీపీ బాలరాజు, జడ్పీటీసీ విజయనిర్మల రమణారెడ్డి, సర్పంచి రేవతి, మహబూబ్ న‌గర్ ఎంపీపీ సుధాశ్రీ, జ‌డ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, వైస్ ఎంపీపీ అనిత, జిల్లా యువజన, క్రీడలు అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement