- సాంకేతిక పరిజ్ఞానంతో చిక్కిన ముగ్గురు
- ఛాలెంజ్‌గా తీసుకొని కేసు ఛేదించిన పోలీసులు
- అభినందించిన ఎస్పీ అఖిల్ మహజన్
సిరిసిల్ల, జనవరి 10 (ఆంధ్రప్రభ): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. బాలిక కిడ్నాప్ కేసు ఎలాంటి ఆధారాలు లేకపోయినా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. శుక్రవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలను తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతపల్లి గ్రామానికి చెందిన సింగారపు మధు, లాస్య దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. లాస్యకు మతిస్థిమితం లేకపోవడంతో మధు కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తున్నాడు.
లాస్య తన కూతురు అద్విత(4)తో కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చింది. దర్శనం కోసం వచ్చిన మహబూబాబాద్‌కు చెందిన ముగ్గురు మహిళలతో చనువు ఏర్పడింది. ఐదు రోజులుగా ఆలయ ఆవరణలో నిద్ర చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో పాప తల్లి మతిస్థిమితం లేకపోవడం కారణంగా పాపను సరిగ్గా చూసుకోవడం లేదని గమనించిన ముగ్గురు మహిళలు లాస్యను నమ్మించి గత డిసెంబర్ 23వ తేదీన వారితో పాటు తీసుకువెళ్లారు. పాప అదృశ్యం కావడంతో తన మేనమామ పాలమూరు గంగస్వామి వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మతిస్థిమితం లేని కారణంగా ఎలాంటి విషయాలు చెప్పకపోవడంతో ఆధారాలు లేనప్పటికీ జిల్లా పోలీసు యంత్రాంగం ఛాలెంజ్‌గా తీసుకొని రాజరాజేశ్వర దేవస్థానం బస్టాండ్, రైల్వే స్టేషన్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, విజయవాడ ప్రాంతాల్లో సీసీ కెమెరా పరిశీలించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మహబూబాబాద్ జిల్లా లోని ఒక గ్రామంలో నిందితులు ఉన్నట్లు గుర్తించారు. గ్రామ సర్పంచ్ సహాయంతో నిందితులైన శ్రీరామోజీ వెంకట నరసమ్మ, గంభీరపు అంజవ్వ, కూనపురి అప్పమ్మల దగ్గర నుంచి పాపను కాపాడి బాలరక్ష భవన్‌కు అప్పగించారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అఖిల్ మహజన్ అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సిఐలు వీరప్రసాద్, సదన్ కుమార్, ఎస్సైలు సుధాకర్, రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.