Tuesday, October 8, 2024

TG | ఫలించిన ఎంపీ అరవింద్ కృషి…. ఈ నెల 13 నుంచి కాజీపేట – దాదర్ రైలు

ఉమ్మడి నిజామాబాద్, ప్రభ న్యూస్ బ్యూరో : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి ఫలించింది. అయోధ్య ప్రయాణికుల కోసం రద్దు చేసిన కాజీపేట-దాదర్ రైలు ఎట్టకేలకు మళ్లీ పట్టాలెక్కనుంది. దీంతో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం ముంబై వెళ్లే ప్రయాణికులను తిప్పలు తప్పనున్నాయి.

ఈ నెల 13 నుంచి మళ్లీ యథావిధిగా రైలు ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. తొమ్మిది నెలల క్రితం అయోధ్యకు రద్దయిన ఈ రైలును నడపాలన్న డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది. ఈ రైలును పునరుద్ధరించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను, ఉన్నతాధికారులను పలుమార్లు కోరారు.

గత 15 రోజుల క్రితం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎంపీ అరవింద్ మరోసారి రైల్వే మంత్రిని కలసి ఎట్టి పరిస్థితుల్లో రైలును ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.

ఆ సమావేశంలో కొద్దిరోజుల్లో రైలును పున:ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ రైలును నిత్యం రైలుగా నడపాలని అరవింద్ రైల్వే అధికారులకు పట్టుబట్టారు. ఎంపీ అరవింద్ వినతి మేరకు రైలును జనవరి 30 వరకు పొడిగిస్తూ రైల్వే అధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement