Friday, November 22, 2024

Exclusive | చెరువు శిఖం ఖతం పెడుతున్న కబ్జాదారులు.. ఆల్విన్​ కాలనీ వాసుల ఆందోళన

హైదరాబాద్​లోని ప్రగతి నగర్​లో శ్మశాన వాటిక, డంపింగ్​ యార్డు స్థలాన్ని ఆక్రమించుకోవడానికి కొంతమంది బడా బాబులు యత్నిస్తున్నారు. దీన్ని కాపాడుకునేందుకు స్థానికులు, ఆల్విన్​ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. సినిమాల్లో జరిగినట్టే అచ్చంగా.. స్థలాల కబ్జా చేయడానికి కొంతమంది పక్కా ప్లాన్​ చేశారు. భూ కబ్జాని ఆపేందుకు ఇవ్వాల (గురువారం) ప్రగతి నగర్​లో ఆల్విన్​ కాలనీ వాసులు సుధీర్​రెడ్డి, నబీ తదితరుల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

కుత్బుల్లాపూర్​, (ప్రభ న్యూస్): హైదరాబాద్​లోని కుత్బుల్లాపూర్​ నియోజకవర్గం, ప్రగతి నగర్​లో భూ కబ్జా దారులు రెచ్చిపోతున్నారు. చెరువు శిఖం భూమిని ఆక్రమించుకనేందుకు తప్పుడు సర్వే నెంబర్లతో మిషన్లను దింపారు. దీంతో స్థానిక ఆల్విన్ కాలనీ​ ఎంప్లాయిస్​ అంతా కలిసి కబ్జాని అడ్డుకునేందుకు యత్నించారు. కాగా, ఇవ్వాల భూ కబ్జాని నిరసిస్తూ ఆందోళన చేపట్టి, మున్సిపల్​ కమిషనర్​గా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో అల్విన్​ కాలనీ ఎంప్లాయీస్​ అసోసియేషన్​ అధ్యక్షుడు సుధీర్​రెడ్డి మాట్లాడుతూ.. 1996లో తాము ఇక్కడ ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్నట్టు తెలిపారు. అప్పటినుంచి ఈ ప్రదేశంలో డంపింగ్​ యార్డు, శ్మశాన వాటిక ఉన్నాయి. ఈ ఏరియాలో అదొక్కటే శ్మశానవాటిక కావడం, అక్కడే తమ కుటుంబంలో చనిపోయిన వారిని దహన సంస్కారాలు చేశామని చెప్పారు.

ఇక.. డంపింగ్​ యార్డులో తడి, పొడి చెత్తను వేరు చేసి వర్మి కంపోస్టు తయారు చేసి అందిస్తున్నట్ట సుధీర్​రెడ్డి  తెలిపారు. ఇవ్వాల సడెన్​గా శంశీగూడ (కూకట్​పల్లి) సర్వే నెంబర్​ 57 పేరు చెప్పి.. కోర్టు జడ్జిమెంట్​ అన్న తప్పుడు పత్రాలతో అనుమతులు పొందారని వారు ఆరోపించారు. ఇట్లా భూమిని కాజేసేందుకు కొంతమంది కబ్జాకు దిగారని, భయ భ్రాంతులకు గురిచేస్తూ డంపింగ్​ యార్డుని పూడ్చి వేశారని, అదే విధంగా శ్మశాన వాటికను కూడా ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని తెలిపారు.  

తెలంగాణ ప్రభుత్వంలో ఇట్లాంటి భూ కబ్జాలు జరగడం దారుణం అని, ప్రగతి నగర్​ ప్రజలు భయపడుతున్నారి సుధీర్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద మిషన్లను పెట్టి, గూండాలను దింపి భూ కబ్జా చేస్తున్నారని,  వాళ్లకు నిజంగా పట్టా ఉండి, కోర్టు ఆర్డర్​ ఉంటే తమకేమీ ఇబ్బంది లేదన్నారు.  కానీ, చెరువు శిఖం భూమి.. గాజులరామారం సర్వే నంబర్​ 305లో..  వాటర్​ బాడీ శిఖం భూమిని ఆక్రమించుకోవడానికి కబ్జాదారులు యత్నిస్తున్నారని సుధీర్​రెడ్డి అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, నిజాంపేట్​ మున్సిపల్​ అధికారులు చొరవ తీసుకోవాలని, ఈ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement