Saturday, November 23, 2024

Delhi: సస్పెన్షన్ ఎత్తివేసే దాకా తగ్గేదేలే.. పార్లమెంట్‌లో గాంధీ విగ్రహం వద్ద రాత్రివేళ‌ ఎంపీల ధర్నా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాజ్యసభలో సస్పెన్షన్‌కు గురైన టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు రాత్రి పూట కూడా దీక్షను కొనసాగించారు. రాత్రంతా పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుటే బైఠాయించారు. రాజ్యసభలో టీఆర్ఎస్ సహా ఇతర విపక్షాలకు చెందిన 20 మంది ఎంపీల సస్పెన్షన్ పై ఆయా పార్టీలు మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా అందరూ కలిసి 48 గంటల నిరవధిక ధర్నాకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా నేటి రాత్రి ధర్నాలో టీఆర్ఎస్ తరఫున ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు.

ఆయన రాత్రంతా విపక్ష పార్టీల ఎంపీలతో కలిసి గాంధీ విగ్రహం ఎదుటే ప్రభుత్వానికి తన నిరసన తెలిపారు. తమపై విధించిన అప్రజాస్వామిక సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఉభయసభల్లో జీఎస్టీ పెంపు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం ఇతర ప్రజా సమస్యలపై చర్చకు అనుమతించాలని ప్లకార్డులు పట్టుకుని ఎంపీలు నినాదాలు చేశారు. తమ సస్పెన్షన్ ఎత్తివేసే వరకు నిరసన కొనసాగిస్తామని ఎంపీలు స్పష్టం చేశారు. అన్యాయంగా తమపై వేసిన సస్పెన్షన్ ఎత్తివేసే వరకు అక్కణ్నుంచి లేచేదే లేదని తేల్చి చెప్పారు.

ప్రభుత్వానికి కనువిప్పు : వద్దిరాజు
అధిక ధరలు, ద్రవ్యోల్బణం, జీఎస్టీ భారాలపై రాజ్యసభలో చర్చకు కేంద్ర ప్రభుత్వం అనుమతించకుడా ప్రశ్నించే పార్టీలను బయటకు వెళ్లగొడుతోందని ఎంపీ రవిచంద్ర ఆరోపించారు. గాంధీ విగ్రహం ఎదుట ధర్నాకు దిగిన ఆయన మీడియాతో మాట్లాడారు. మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే తాము రాత్రంతా ధర్నా లో కూర్చున్నామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజా సమస్యలపై చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ నిరసన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement