హైదరాబాద్, ప్రభన్యూస్: రాష్ట్రంలో పోడు భూముల హక్కుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం సూచించిన తగిన ధృవీకరణ పత్రాలు లేక సాగుదారులు ఇబ్బందులు పడుతున్నారు. పోడు భూముల దరఖాస్తు ఫారంలో రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఇంటి పన్ను రసీదు, గ్రామ పెద్ద వాంగ్మూలం సంబంధిత ధృవీకరణ పత్రాలను జతపర్చాలనే నిబంధన ఉంది. వీటితో పాటు ప్రతి ఒక్కరూ కుల ధృవీకరణ పత్రాలను కూడా జత చేయాలని అధికారులు సూచించారు. ఈనెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఇందులో మొదటి రెండురోజులు దరఖాస్తుల పంపకం, ఎలా దరఖాస్తు చేయాలి, అటవీ భూముల రక్షణకు సంబంధించిన అంశాలపై గ్రామాల్లో అవగాహన కల్పించారు.
ఈ క్రమంలో అనేక జిల్లాల్లో 16వ తేదీతో క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయ్యిందని అధికారులు పేర్కొనడంతో దరఖాస్తు చేయకుండా ఇప్పటి వరకు కాలయాపన చేసిన రైతులు నిరాశ చెందుతున్నారు. గడువును పొడిగించాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. దరఖాస్తు చేసేందుకు తక్కువ సమయం ఇవ్వడంతో అనేక మంది రైతులు రెవెన్యూ, మీసేవ కేంద్రాల వద్ద సర్టిఫికెట్ల కోసం క్యూ కడుతున్నారు. చాలమంది సకాలంలో కుల ధృవీకరణ పత్రాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుల గడవు సమయం ముగిసే సరికి ఒక్కో జిల్లా నుంచి ఎనిమిదివేలకు పైగా దరఖాస్తులు అందినట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily