- శంకుస్థాపన ఒకచోట. !!! నిర్మాణం ఒక చోట.!!!
- మండల వాసుల కోసం జాతీయ రహదారి పక్కన ఎంపిక.
- ఔట్ పేషెంట్ కే పరిమితమైన ప్రస్తుత ఆసుపత్రి
- శిథిలావస్థకు చేరిన అంబులెన్స్….!!
- పిల్లర్ల దశలో ఆగిన నిర్మాణ పనులు.
- జాప్యంతో శిథిలమవుతున్న నిర్మాణం.
- పనుల నిలిపివేత.. సామాగ్రి దొంగల పాలు
ముధోల్, నవంబర్ 5 (ఆంధ్రప్రభ) : ముధోల్ మండల ప్రజల కోసం 30పడకల ఆసుపత్రి కల సాకారమయ్యేది ఎన్నడని మండల ప్రజలు వేచి చూడాల్సిందేనా..! ప్రభుత్వం మారినా ఆసుపత్రి నిర్మాణ పనుల్లో పురోగతి లేదు. గత ప్రభుత్వం హయాంలో అప్పటి కలెక్టర్ ముషారఫ్ అలీ స్వయంగా నిర్మాణ స్థలం కోసం ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో నిర్మించాలని ప్రతిపాదనలు పంపారు. తెలంగాణ వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన తన్నీరు హరీష్ రావు 30పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు.
శంకుస్థాపన ఒకచోట చేసిన నిపుణుల ఆలోచన, అవసరాల దృష్ట్యా మండల వాసులందరికీ అందుబాటులో ఉండటానికి జాతీయ రహదారి పక్కన స్థలాన్ని ఎన్నుకొని నిర్మాణ పనులు ప్రారంభించారు. మొదట్లో చురుకుగా కొనసాగిన పనులు పిల్లర్ల స్థాయికి రాగానే పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం పిచ్చి మొక్కలతో నిండిపోయి, ఇనుప చువ్వలు తుప్పు పట్టి, శిథిలావస్థకు చేరుకుంది. ఇంకను పనులు ప్రారంభం కావడం ఆలస్యమైతే నాణ్యత లోపించి, భవిష్యత్తులో భవనం ఎంత కాలం సేవలు అందించునని మండల వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఔట్ పేషంట్ కే పరిమితం..
20 సంవత్సరాల కింద ఈ ఆసుపత్రిలో ఆసుపత్రి క్వార్టర్ లో వైద్యులు అందుబాటులో వుండేవారు. రోజుకు పదుల సంఖ్యలో ఆపరేషన్స్ అయినటువంటి చరిత్ర కలిగిన ఆసుపత్రి ఔట్ పేషంట్ కే పరిమితం కావడం బాధాకరం. ప్రస్తుతం వైద్యుల, నర్సింగ్ స్టాఫ్ సంఖ్యను పెంచడంతో రోజుకు సరాసరిన 200నుండి 300వరకు రోగులు వస్తున్నారు. రక్త పరీక్షలు నిర్వహిస్తున్నా ఫలితం ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని రోగులు ఆవేదనను తెలిపారు. స్థానికంగా సివిల్ సర్జన్ ఉండి, ఆపరేషన్ గదిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
శిథిలావస్థకు చేరిన అంబులెన్స్..
ముధోల్ ఆసుపత్రిలో అంబులెన్స్ ఉన్నా ఎన్నడూ ఉపయోగించిన వారు లేరు. వానకు నాని, ఎండకు ఎండి, పిచ్చిమొక్కల మధ్య తుప్పు పట్టి శిథిలమవుతున్నా పట్టించుకునే నాథుడు లేరు. ఒకవేళ 30పడకల ఆసుపత్రి పనులు ప్రారంభమై, నిర్మాణం పూర్తయ్యే నాటికి అంబులెన్స్ తుప్పు పట్టి వినియోగంలోకి వచ్చే అవకాశం ఉండకపోవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మండల కేంద్రంలో అంబులెన్స్ ఉన్న 108 సేవలే ప్రజలు ఉపయోగించుకుంటున్నారు.
ప్రజా ధనం పరుల పాలు..
ఆసుపత్రి పనులు ఆగిపోవడంతో నిర్మాణానికి సంబంధించిన లక్షల విలువ చేసే సామాగ్రి నిర్మాణ స్థలంలో ఎండకు ఎండి, వానకు తడిసి పాడవుతున్నాయి. నిర్మాణ స్థలం పిచ్చి మొక్కలతో నిండిపోవడం, అటు వైపు ఎవరూ కన్నెత్తి చూడకపోవడంతో అదే అదనుగా భావించి సామాగ్రిని అందినకాడికి తీసుకెళ్తున్నారు. కొన్ని తరాల వరకు సేవలందించడానికి 30పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.