తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాయత్తు మహిమతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. కొత్తగూడెం క్లబ్ లో డా.జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ…. అన్ని మతాల్లో కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఒకరితో ఒకరు ప్రేమగా మెలగాలని చెప్పారు. భూమిపై విర్రవీగుతూ అహంకారంతో నేలను చీల్చలేవు, పర్వతాలను తాకలేవు అని ఖురాన్ చెప్పిందని అన్నారు.
ఖురాన్ ఒక గొప్ప గ్రంధమని, ఇప్పటికి తెలుగులో ఉన్న ఖురాన్ ను నేను పటిస్తూ ఉంటానన్నారు. నా చిన్న తనంలో జబ్బు చేసి హాస్పిటల్ కు వెళ్లిన క్రమంలో డాక్టర్లు సైతం చేతులు ఎత్తేయగ నా తల్లిదండ్రులు ఒక మసీదులో తాయత్తు కట్టిస్తే అ తాయత్తు మహిమ వల్ల తాను బ్రతికానని అన్నారు. దేశంలో ఇప్పుడున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ముఖ్యంగా గత వారం రోజుల నుండి అత్యంత బాధాకర సంఘటనలు జరిగాయని, ఒక వర్గం పై దాడులు జరగడం అన్యాయమని అన్నారు. అయితే డీహెచ్ గతంలో క్షుద్రపూజలు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో డీహెచ్ మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తున్నట్లు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.