Tuesday, November 19, 2024

NZB: పోలింగ్ బూత్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్, ఆగస్టు 26 (ప్రభ న్యూస్): ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు-చేర్పులకు అవకాశం కల్పిస్తూ పోలింగ్ బూత్ ల పరిధిలో ఈనెల 26, 27 తేదీల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం పలు పోలింగ్ బూత్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోస్రా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, చందూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో గల పోలింగ్ కేంద్రాలను సందర్శించి ప్రత్యేక శిబిరాల నిర్వహణ తీరుతెన్నులు పరిశీలించారు. బీ.ఎల్.ఓ లు, ఎన్నికల అధికారులు అందుబాటులో ఉన్నారా ? అని ఆరా తీశారు.

వారి వద్ద గల రిజిస్టర్లను తనిఖీ చేసి, ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పుల వివరాలను పరిశీలించారు. ప్రత్యేక శిబిరాల గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని, ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా చొరవ చూపాలన్నారు. మృతిచెందిన ఓటర్లకు సంబంధించి వారి కుటుంబ సభ్యులను సంప్రదించి మరణ ధ్రువీకరణ పత్రం సేకరించి క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే జాబితా నుండి పేరు తొలగించాలని సూచించారు. కలెక్టర్ వెంట అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement