Wednesday, November 20, 2024

NZB: చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించిన కలెక్టర్

అస్వస్థతకు గురై నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీంగల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరామర్శించారు. మంగళవారం ఉదయం ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్, విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వాకబు చేశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని, బాలికలందరూ పూర్తి స్థాయిలో కోలుకునేంత వరకు నిరంతర పర్యవేక్షణలో ఉంచాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ కు సూచించారు. అన్ని వార్డుల్లో తిరుగుతూ చికిత్స పొందుతున్న బాలికల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. జరిగిన సంఘటన గురించి బాలికలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సోమవారం రాత్రి భోజనంలో అందించిన ఆహార పదార్థాల గురించి ఆరా తీశారు. ఎలాంటి ప్రమాదం లేదని బాలికలకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో విద్యార్థినులు భోజనం చేసిన తరువాత కలుషిత ఆహారం కారణంగా కొంతమంది కడుపు నొప్పి, వాంతులు చేసుకోవడంతో వారిని హుటాహుటిన భీంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారన్నారు. మెరుగైన వైద్యం కోసం 103మంది బాలికలను జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారని, ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి బాగుందని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని కలెక్టర్ తెలిపారు.

వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణలో విద్యార్థినులు కోలుకుంటున్నారని, ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగైన మీదట విద్యార్థినులను డిశ్చార్జ్ చేస్తారన్నారు. భీంగల్ కస్తూర్బా విద్యాలయంలో ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయించామని తెలిపారు. కలుషిత ఆహారం కారణంగా బాలికలు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని, సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్.వి.దుర్గాప్రసాద్, ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, మెప్మా పీ.డి రాజేందర్, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement