శంకర్పల్లి, (ప్రభ న్యూస్) : ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వెరసి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాల్టీ పరిధిలోని చేవెళ్ల రోడ్డులో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. రెండేండ్ల నుంచి పరిస్థితితో ఎట్లాంటి మార్పు రాలేదు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం రహదారులకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తున్నట్టు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చెబుతున్నా.. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు.
చేవెళ్ల రోడ్డులో రోడ్డు దెబ్బతినడంతో వాహనదారులు యాక్సిడెంట్లకు గురవుతున్నారు. మూడు నెలల క్రితం పర్వేద గ్రామానికి చెందిన మహిళ రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా ద్విచక్ర వాహనం కుదుపులకు కిందపడిపోయింది. అక్కడికక్కడే ఆమె చనిపోయింది. ఇట్లా ఈ రోడ్డులో జర్నీ చేసిన వారు చాలామంది కుదుపులకు వెన్నుపూస, నడుం నొప్పులతో బాధపడుతూ హాస్పిటళ్లకు క్యూకడుతున్నారు.
ఇక.. ఇప్పుడు వీడకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్డు గుంతలలో నీళ్లు నిలిచిపోయాయి. అక్కడ రోడ్డుందా? గుంత ఉందా తెలియకపోవడంతో వాహనదారులు అట్లనే వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. రెండు సంవత్సరాల నుండి మున్సిపాలిటీలోని జనాలు నెత్తి నోరు మొత్తుకున్నా కాంట్రాక్టర్లలో కదలిక లేదు. ఒకవైపు జనాలు చస్తున్నా రోడ్లు భవనాల శాఖ అధికారులకు కనీసం చీమకుట్టినట్టు అయినా లేదు.
త్వరలో ఎన్నికలు రానున్న వేళ బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పనులతో జనాల ఆదరణ పొందాలని చూస్తుంటే.. అధికారుల తీరు మాత్రం జనాలను బాధలకు గురిచేస్తోంది. మరి రోడ్డు సమస్య ఇట్లనే ఉంటే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవతీసుకుని రోడ్డు పనులు చేయించి ప్రజలను బాధల నుంచి విముక్తులను చేయాలని కోరుతున్నారు.