Tuesday, November 26, 2024

వరదనీటిని ఒడిసిపట్టేందుకు వేగం పుజుకున్న చెక్‌ డ్యాంలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రస్తుత వర్షాకాలంలో ప్రతినీటి చుక్కను భద్రపర్చేందుకు ఎక్కడికక్కడ చెక్‌ డ్యాంల నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి. చెక్‌ డ్యాం లతో ప్రవాహాలకు అడ్డుకట్టలువేసి వరదనీటిని నిల్వచేసేప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలోని అన్ని కాలువలు,ప్రవాహాలను పునరుజ్జీవింప చేసి ఉపరితల, భూగర్భ జలాలపెంపుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన చెక్‌ డ్యాంల నిర్మాణానికి నాబార్డ్‌ తనవంతుగా రుణం ఇచ్చి ప్రోత్సహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన అనంతరం 1416 చెక్‌ డ్యాంల నిర్మాణాలు లక్ష్యంగా దశలవారి పనులు చేపట్టింది. రూ. 4667 కోట్లతో ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా 2014 నుంచి 2019 మధ్యకాలంలో అనేక ఉత్తర్వుల ద్వారా 202 చెక్‌ డ్యాంలకు రూ.764 కోట్ల అంచనావ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరుచేసింది.

ఇందులో 51 చెక్‌ డ్యాంల నిర్మాణాలు పూర్తి కాగా మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి. ఎగువస్థలాల్లోని ప్రవాహాలు, నదులలో వర్షపు నీటిని తీసుకోవడానికి, భూగర్భ జలాలను స్థిరీకరించడానికి, క్లిష్టమైన కాలంలో చిట్టచివరి ప్రాంతాలకు భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాల నుంచి నీటిని పునరుత్పత్తి చేసి అందించడానికి ఆయకట్టు, ఆయకట్టుయేతర ప్రాంతాలలో 8/3/2019 న జీఓ నం. 8 ద్వారా 4నుంచి 8 వరుసల ప్రవాహాలపై 1200 చెక్‌ డ్యాంల నిర్మాణం కోసం రూ, 3825 కోట్ల మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలక అనుమతి ఇచ్చింది.

- Advertisement -

ఇందులో దశలవారిగా చెక్‌ డ్యాంలను నిర్మించేందుకు నీటి పారుదల శాఖ డీపీఆర్‌ రూపొందించింది. ఒకటవ దశలో రూ. 2906 మొత్తంలో 638 చెక్‌ డ్యాంల నిర్మాణాన్ని చేపట్టగా 465 చెక్‌ డ్యాంల నిర్మాణానికి నాబార్డు రూ. 2006 కోట్లురుణ సహాయం చేసింది. ఈ రుణంతొ 465 చెెక్‌డ్యాంల్లో 252 చెక్‌ డ్యాంలను సాగునీటి పారుదల పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 173 చెక్‌ డ్యాంలను రూ. 900 కోట్లతోనిర్మాణం పూర్తి చేసింది. ప్రస్తుతం వివిధ దశల్లో 386 చెక్‌ డ్యాంల పనులు కొనసాగుతున్నాయి. రాబోయో కాలంలో మరో రూ. 1848 కోట్ల వ్యయంతో మిగిలి 556 చెక్‌ డ్యాంల నిర్మాణాన్ని చేపట్టేందుకు సమగ్ర ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అలాగే రూ. 471 కోట్ల అంచనావ్యయంతో ఆయకట్టు

ప్రాంతాల్లో 3వేల స్లూయిస్‌ల నిర్మాణాన్ని దీర్ఘ కాలంగా ఉన్న అవసరాలను తీర్చడానికి ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతాల్లో 6281 చిన్న తరహా సాగునీటి చెరువులను కాలువ వ్యవస్థలకు అనుసంధానం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వర్షకాలంలో సముద్రంలో కలిసే వరదనీటిని సాధ్యమైనంత వరకు నిలిపి వేసవిలోనూ సాగునీటిని పుష్కలంగా పంటపొలాల్లో ప్రవహింపచేసేందుకు భవిష్యత్‌ ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసింది, అలాగే కృష్ణా, గోదావరితో పాటుగా వాటి ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో నిర్మాణ దశలో ఉన్న
ప్రాజెక్టులను పూర్తిచేసి సుమారు 500 టీఎంసీల నీటిని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కృష్ణా నది పై నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులపై ఏపీ చేసిన ఫిర్యాదులను ధీటుగా ఎద్కోవడంతో పాటుగా వరదజలాల్లో అదనపు హక్కు పొందేందుకు అవసరమైన చర్యల్లో నిర్మగ్నమైన రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డు రుణ సహాయం ఎంతో ఊరట కలిగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement