టేకుమట్ల (ఆంధ్రప్రభ ): జయశంకర్ జిల్లా టేకుమట్లలో మిట్ట మధ్యాహ్నం ద్విచక్ర వాహనం వెళ్తున్న దంపతులను పల్సర్ వాహనంపై ఇద్దరు వ్యక్తులు వెంబడించి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన సంఘటన మండలంలోని రాఘవరెడ్డిపేట శివారులో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండలం, కిష్టంపేటకు చెందిన పులగోర్ల చేరాలు-వనజ దంపతులు వ్యక్తిగత పనిపై జమ్మికుంటకు వెళ్ళి చిట్యాల మండలంలోని వరికోల్ పల్లికి బంధువుల ఇంటికి వెళ్తున్న క్రమంలో టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట శివారులో ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్ పై వెంబడించి చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు తెలిపారు.
వారిని రాఘవరెడ్డిపేట వరకు వెంబడించగా కుందనపల్లి వైపు వెళ్ళినట్లు తెలిపారు. కాగా చైన్ విలువ రూ.2లక్షల 45వేలు ఉంటుందని తెలిపారు. భాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల సిఐ మల్లేష్ యాదవ్, ఎస్సై గోగికారి ప్రసాద్ తెలిపారు.