న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ చరిత్రలో పార్లమెంట్‌లో ఇంత తీవ్ర స్థాయిలో రైతుల అంశాలను లేవనెత్తి పోరాడిన రాజకీయ పార్టీ టీఆర్‌ఎస్ తప్ప మరొకటి లేదని ఆ పార్టీ ఎంపీలు చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం మేరకు వరి ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్, దేశ ప్రజలు, రైతులను తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర వాణిజ్య, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌పై టీఆర్‌ఎస్ ఎంపీలు రాజ్యసభ, లోక్‌సభలో సోమవారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసును అందజేశారు. టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాలోతు కవిత, వెంకటేష్ నేత, రాములు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు నోటీసు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై కిసాన్‌కో బచావో, వీ వాంట్ జస్టిస్ అంటూ లోక్‌సభలో వారంతా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. అనంతరం తెలంగాణ భవన్‌లో వారు మీడియాతో మాట్లాడారు.
కేంద్రానికి-రాష్ట్రానికి ధర్మ యుద్దం : కేకే
తెలంగాణ రాష్ట్రానికి, కేంద్రానికి ధర్మ యుద్ధం నడుస్తోందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కె. కేశవరావు చెప్పుకొచ్చారు. యాసంగిలో బ్రోకెన్ రైస్ వస్తుందనే విషయం కేంద్రానికి తెలుసని, దశాబ్దాలుగా ఎఫ్‌సీఐ వాళ్ళు సేకరణ చేస్తారని అన్నారు. ఆహార భద్రతలో భాగంగా సేకరించే ధాన్యాన్ని ఎగుమతి చేయవద్దని కేంద్రమంత్రి చెప్పారు. ఎగుమతి కేంద్రప్రభుత్వ పరిధిలోని అంశమని, ఏడేళ్లుగా ప్రైవేటీకరణ ప్రస్తావన వస్తోందని చెప్పారు. తాము బియ్యాన్ని ఎగుమతి చేయమని కేకే స్పష్టం చేశారు. డబ్ల్యూటీవో నియమావళి ప్రకారం రాయితీలు ఉన్నవాటిని ఎగుమతి చేయలేమని అన్నారు. 110 దేశాలకు పారా బాయిల్డ్ రైస్ ఎగుమతి చేస్తున్నారని, ఎగుమతికి అవకాశం, మార్కెట్ ఉందని వివరించారు. మీ ప్రభుత్వమే వస్తుంది కదా మీరే తీసుకోండని మంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్న వ్యాఖ్యలను కేకే గుర్తు చేశారు. ప్రపంచంలో ఇన్ని దేశాలు సిద్ధంగా ఉంటే పారా బాయిల్డ్ రైస్‌ను ఎందుకు పంపడం లేదని ఆయన ప్రశ్నించారు. ఒక పక్క మార్కెట్ ఉంటే మరోవైపు దేశంలో మిగులు ధాన్యం ఉందని చెబుతున్నారని ధ్వజమెత్తారు. వన్ నేషన్-వన్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీని తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఒప్పుకునే వరకు తమ యుద్ధం కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు. వెయ్యేళ్లుగా వస్తున్న రైతుల సంప్రదాయాలను ఒక్కరోజులో మార్చలేమని కేకే స్పష్టం చేశారు.
బీజేపీ నేతలు తప్పుదోవ పట్టించారు : ఎంపీ వెంకటేష్ నేత
గతంలో 50 లక్షల పైగా ఉన్న వరి సాగును రైతులను చైతన్యపరిచి 35 లక్షలకు తగ్గించామని ఎంపీ వెంకటేష్ నేత చెప్పారు. బీజేపీ నేతలు తప్పుదోవ పట్టించకపోతే ఇంకా తగ్గేదని ఆయన అభిప్రాయపడ్డారు.
డబ్ల్యూటీవో పేరుతో కుంటిసాకులు : నామా నాగేశ్వరరావు, లోక్ సభా పక్ష నేత
గతంలో తాము చెప్పిందే ఇప్పుడు జరుగుతోందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ రైతుల పట్ల కక్ష కట్టి వివక్ష చూపుతున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో ఒక మాట, బయట ఒక మాట, తెలంగాణలో ఒక మాట మాట్లాడుతున్నారని, మాటలు మార్చి రైతులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. దేశం నుంచి పారా బాయిల్డ్ రైస్‌తో పాటు అన్ని రకాల రైస్ ఎగుమతవుతోందన్న ఆయన, ఇందుకు కేంద్ర ప్రభుత్వమే అనుమతినివ్వాలని గుర్తు చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాల రైతుల బియ్యాన్ని ఎగుమతి చేస్తూ తెలంగాణ నుంచి మాత్రం ఎందుకు చేయరని నిలదీశారు. తెలంగాణ వరకు రాగానే డబ్ల్యూటీవో అంటూ కుంటిసాకులు చెప్తున్నారని నామా మండిపడ్డారు. తెలంగాణ రైతాంగాన్ని ఎలా కాపాడుకోవాలో సీఎం కేసీఆర్‌కు తెలుసునన్నారు. ఎమ్మెస్పీ మీద ధాన్యం సేకరిస్తామని పార్లమెంట్‌లో లిఖిత పూర్వకంగా చెప్పిన విషయాన్నే తాము అడుగుతున్నామని చెప్పుకొచ్చారు. 13% పారా బాయిల్డ్ రైస్ ఎగుమతి చేసి కేవలం తెలంగాణ అంశం వచ్చేసరికి ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి ఉంటే ఆ రాష్ట్రానికి అండగా ఉంటాడని భావిస్తారని కిషన్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వ ప్రకటన గురించి అభ్యర్థిస్తే స్పందన లేకపోవడంతో ఉభయ సభలను వాకౌట్ చేశామని నామా నాగేశ్వరరావు తెలిపారు.
కేసీఆర్ తుమ్మితే కొట్టుకుతారు : ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
మేము దద్దమ్మలం, మాకు ధాన్యం కొనుగోలు చేతకాదని పార్లమెంట్‌లో చెప్పండంటూ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. తాము రైతులను కాపాడుకుంటామని నొక్కి చెప్పారు. తమ నాయకులపై అసభ్యకరంగా మాట్లాడితే సహించేదిలేదని ఆయన స్పష్టం చేశారు. మీకు కేంద్ర ప్రభుత్వాన్ని నడపడానికి రావడం లేదని మండిపడ్డారు. తమ నాయకుడు కేసీఆర్‌కు ఆ సత్తా ఉందని ఆయన చెప్పుకొచేచారు. సీఎం కేసీఆర్ తుమ్మితే కొట్టుకుపోయే నాయకులు మీరంతా, ఆయన కాలిగోటికి కూడా సరిపోరంటూ ప్రభాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.