ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ఘటన జరిగింది. కారు చెరువులో మునిగిపోవడంతో ఐదుగురు యువకులు మృతిచెందారు. పోలీసులు వారి మృతదేహాలను వెలికితీశారు.
మద్యం మత్తులోనే..
మృతులు హైదరాబాద్ హయత్‌నగర్‌లోని ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్‌గా గుర్తించారు. మృత దేహాలను భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులున్నారు. మణికంఠ యాదవ్ అనే వ్యక్తి కారు అద్దాలు పగులగొట్టి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
కాగా, వీరు హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా 20 నుంచి 21 ఏళ్ల వయసులోపు వారే. శుక్రవారం రాత్రి ఇంట్లో నుంచి వీరంతా బయలుదేరినట్లు సమాచారం. మద్యం మత్తులోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భూదాన్ పోచంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.