ఆంధ్రప్రభ బ్యూరో, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాలెపూర్ ఘాట్ వద్ద ఆదివారం సాయంత్రం ఐచర్ వ్యాన్ లోయలో పడి గాయపడ్డ వారిలో ఇద్దరు మృతిచెందారు. గుడిహత్నూర్ మండలం సూర్యగూడ నుండి 60మంది ఆదివాసులు జంగు భాయ్ పుణ్యక్షేత్రానికి వెళుతుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
వీరిలో 47మందికి గాయాలు కాగా, పరిస్థితి విషమంగా ఉన్న 8మంది క్షతగాత్రులను ఆదివారం రాత్రి రిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులు కుమ్ర మల్కు (60) అర్ధరాత్రి మృతిచెందగా, తొడసం నాగు బాయి(74) ఈరోజు ఉదయం మృతిచెందింది. వీరిద్దరి శవ పంచనామా అనంతరం మృతదేహాలను సొంత గ్రామమైన సూర్యగూడకు తరలించారు.
గాయపడ్డ వారిని పరామర్శించిన మాజీ ఎంపీ, ఎమ్మెల్యే..
రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సోమవారం మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీమంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్ పరామర్శించారు. ఇద్దరు మృతిచెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా ఈ ప్రమాద ఘటనలో వాహనం బ్రేకులు పనిచేయకపోవడంతోనే అదుపుతప్పి లోయలో పడినట్టు క్షతగాత్రులు తెలిపారు. వ్యాన్ డ్రైవర్ కే.శ్రీరామ్ పరారీలో ఉన్నారు.