మరిపెడ, (ప్రభ న్యూస్): మహబుబాబాద్ జిల్లాలో ఓ పోకిరీ వెధవపై పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినిని వేధిస్తున్న ఓ యువకుడిపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బుధవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో దూలం పవన్ కుమార్ తెలిపారు. నర్సింహులపేట మండలానికి చెందిన ఓ యువకుడు మరిపెడ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని రోజూ బైకుపై వెంబడిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
చాలా రోజులుగా ఓపిక పట్టిన విద్యార్థిని విసిగిపోయి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించటంతో ఆ పోకిరీ వెధవపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆకతాయిలు ఎవరైన సరే.. ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే సహించేది లేదని, తల్లిదండ్రులకు కానీ, అమ్మాయిలకు కానీ ఎట్లాంటి అనుమానం కలిగినా పోలీసులకు కంప్లెయింట్ చేయాలని పోలీసులు తెలిపారు. ఆడ పిల్లలు, మహిళల, విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలుంటాయన్నారు.