తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ఢిల్లీ వదిలిన బాణాలని, సీఎం కేసీఆర్ మాత్రం తెలంగాణ బ్రహ్మాస్త్రం అన్నారు మంత్రి కేటీఆర్. శాసనసభలో ఇవ్వాల (శనివారం) ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. తమదేమో గల్లీ పార్టీ.. సింగిల్ విండో చైర్మన్ నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి తమ నాయకుడని స్పష్టంచేశారు. ఇక.. వాళ్లది ఢిల్లీ పార్టీ అన్నారు. ఏది కావాన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందేనని విమర్శలు గుప్పించారు.
కానీ, రాష్టంలో మాత్రం ప్రభుత్వంలో, పార్టీలో నిర్ణయం తీసుకోవాలంటే.. ధైర్యం, సాహసం, తెగువ, తెలివి, స్వేచ్ఛ, స్వతంత్రం, వెన్నెముక ఉన్న నాయకుడు తమకున్నాడని చెప్పారు మంత్రి కేటీఆర్. నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్‌ది మెరుపు వేగం అని, అమలు చేయడంలో రాకెట్ స్పీడ్ అని వెల్లడించారు.
రైతుబంధు, దళితబంధు ఆచరణ క్షణాల్లో అమలైపోయిందని, కాంగ్రెస్, బీజేపీ అధిష్ఠానాలు ఢిల్లీలో ఉంటాయన్నారు. ఈ లోపు ప్రజలు ఇక్కడ చస్తారు. కాంగ్రెస్, బీజేపీనో అధికారంలోకి వస్తే.. ప్రతి దానికి ఛలో ఢిల్లీ అంటారని చెప్పారు. రాజకీయాలు, ప్రజాజీవితం అంటే టెన్ జన్‌పథ్ కాదు.. తెలంగాణ జనపథంతో కలిసి కదం తొక్కితే అప్పుడు ఆదరణ ఉంటదన్నారు.