గ్రామీణ స్థాయిలో ఐటీ ఉద్యోగాలు అందించడమే లక్ష్యంతో ఈ ఐటీ హబ్‌ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఐటీ హబ్‌లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ఈ జాబ్ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హాజరైంది. ఈ కార్యక్రమాన్ని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీ గణేశ్ గుప్తాతో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటు గొప్ప విషయమని అన్నారు. విదేశీ కంపెనీలు రావడానికి సహకరించిన మహేశ్ బిగాలకు ధన్యవాదాలు తెలిపారు. ఐటీ హబ్ అంటే కేవలం ఉద్యోగమే కాదని.. ఉద్యోగాలు సృష్టించేందుకు కూడా దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. యువత తమ నైపుణ్యాలతో ఐటీ హబ్ స్పేస్‌ను వాడుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. నిజామాబాద్‌లో సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి ఐటీ హబ్ కేంద్ర బిందువు అవుతుందని తెలిపారు. ఇది మొదటి దశ మాత్రమే అని, త్వరలో రెండో దశగా ఐటీ హబ్ కూడా ప్రారంభిస్తామని చెప్పారు. ఇండస్ట్రియల్ పార్క్, ఆటో పార్క్ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. నిజామాబాద్ ఐటీ హబ్ నంబర్‌వన్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.