రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా శాసనసభలో రవాణా శాఖ సంబంధిత బడ్జెట్ పద్దును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రతిపాదించిన అనంతరం జరగిన చర్చలో మంత్రి అజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా సభలో పలువురు శాసనసభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలతో మంత్రి వివరణ ఇచ్చారు. ఆర్టీసీ పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రవాణా శాఖ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే విధంగా ఉన్నదన్న ఈ విషయం ప్రతిఒక్కరికీ సుపరిచితమైనదన్నారు. పౌర సేవలు రవాణా శాఖ ప్రజలకు ఆర్టీవో కార్యాలయానికి రాకుండా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని రవాణా శాఖ సకాలంలో పారదర్శకంగా సేవలు ప్రజలకు అందజేస్తున్నామన్నారు. అందులో దాదాపు 17 సేవలున్నాయన్నారు. ఎనీ వేర్ ఎనీ టైం ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ లు, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ చిరునామా మార్చుకునే సౌకర్యం కల్పించినట్టు చెప్పారు.
ఆర్టీసీ ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధి తో ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. దాదాపు గడిచిన ఏడు నెలల నుండి మొదటి తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని సీఎం కెసిఆర్ మానవతా దృక్పథంతో ప్రభుత్వ సహాయం 1500 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించడం హర్షించదగ్గ శుభపరిణామమని అన్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య కంటే ఉద్యోగుల సంఖ్య ఎక్కువ ఉన్నదని కార్మికులను ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తున్నామని ఎవరైనా అదనపు డ్యూటీలు చేస్తే వారికి అదనపు జీతభత్యాలు ఇవ్వబడుతుందని వారు అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ శాతం లో విద్యార్థులు ఆడపిల్లలు ప్రయాణిస్తున్నారని ఆడపిల్లలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని దాంతో పాటుగా బస్ సౌకర్యం కల్పించి వారిని ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు.