జగిత్యాల, (ప్రభన్యూస్): యూరప్‌లోని సైప్రస్ దేశానికి పంపిస్తామని చెప్పి నిరుద్యోగుల నుండి రూ.3 నుండి 5లక్షల వరకు వసూళ్లు చేసి ఒ ఏజెంట్ పరారైన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై గల్ఫ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో అమెరికా, ఇంగ్లాండ్, ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. విద్యావంతులు ఉద్యోగాల కోసం వెళ్తుండగా, నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకొని జగిత్యాలకు చెందిన మహేష్ అనే వ్యక్తి ఒ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగులను ఆకట్టుకున్నాడు.
సింపుల్‌గా చిటికెలో మీకు ఉద్యోగులు ఇప్పిస్తానని రూ.5లక్షలు ఇస్తే సరిపోతుందని నమ్మబలికాడు. నిరుద్యోగులు యూరప్ ఖండంలోని సైప్రస్ దేశానికి పంపిస్తానని చెప్పగానే వారి పాస్‌పోర్టులు ఇచ్చి, రూ.3నుండి 5లక్షల వరకు మహేష్‌కు చెల్లించారు. తమను ఎప్పుడు పంపుతారని నిరుద్యోగులు అడుగగా వీసాలు వచ్చాయి..టికెట్‌లు వచ్చాయని నమ్మబలికాడు. మహేష్ నిరుద్యోగులకు ఇచ్చిన వీసాలు, టికెట్‌లు ఫేక్ కావడంతో తాము మోసపోయామని గ్రహించి గురువారం మహేష్ కార్యాలయాన్ని ముట్టించి పోలీసులను ఆశ్రయించారు. తమ డబ్బులను తమకు ఇప్పించాలని కోరుతున్నారు. సదరు బ్రోకర్ మహేష్ నిరుద్యోగుల వద్ద నుండి వసూలు చేసిన డబ్బులను రియల్ ఏస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టినట్లు, మహేష్‌పై మరింతకొంత మంది ఉన్నారని తెలిసింది.