Thursday, September 12, 2024

Peddapalli: నిందితులకు శిక్ష పడేలా చూడాలి… సీపీ శ్రీనివాస్

కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకం
పోలీసులపై నమ్మకం పెరిగేలా పనిచేయాలి

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : కోర్టు డ్యూటీ ఆఫీసర్లు నేరస్థులు శిక్షల నుండి తప్పించుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించి నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ ఆవరణలో కమిషనరేట్ పరిదిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, కోర్టు లైసెన్ ఆఫీసర్స్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కోర్టు కానిస్టేబుల్ కోర్టు కేలండర్ తయారు చేసుకోవాలని, నిందితులకు శిక్షలు పడే విధంగా సాక్షులను మోటివేషన్ చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, షెడ్యూల్ ప్రకారం సాక్షులను కోర్టులో హాజరుపర్చాలన్నారు. పెండింగ్, పెట్టి కేసులను వెంటనే డిస్పోజల్ చేయాలని, నేరస్తులకు శిక్షలు పడితే నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు.

కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని, నేర రహిత సమాజంగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్షపడే విధంగా కోర్టు డ్యూటీ పోలీసు సిబ్బంది శ్రమించాలన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుండి కేసు పూర్తయ్యేంత వరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించడంలో కోర్టు కానిస్టేబుల్ ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు.

- Advertisement -

కోర్టుకు ఎఫ్ఐఆర్ లను సరైన సమయంలో అందించాలని, కేసుల్లో ఉన్నటువంటి ప్రాపర్టీని సరైన సమయంలో కోర్టులో డిపాజిట్ చేయాలన్నారు. కోర్టులో బాధితులకు న్యాయం జరిగే విధంగా నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషిచేయాలని, నేరస్తులకు వారంట్స్, సమన్స్, సత్వరమే ఎగ్జిక్యూటివ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు ప్రాసిక్యూషన్ కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు తెలియజేయాలని, కోర్టు క్యాలెండర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, కేసు ట్రయల్స్ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలు, సూచనలు పాటించాలన్నారు.

భాదితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, బాధితులకు పోలీసులపై నమ్మకం పెరిగేలా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ అడ్మిన్ సి.రాజు, గోదావరి ఖని ఏసీపీ రమేష్, పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఎస్ బీ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏసీపీ ప్రతాప్, సీసీ ఆర్ బీ ఇన్ స్పెక్ట‌ర్ బుద్దే స్వామి, పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement