ఉత్తర తెలంగాణ, ప్రభన్యూస్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేటి మధ్యాహ్నం నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఎన్నికలు సమీపించే నేపథ్యంలో మోడీ నిజామాబాద్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంతోపాటు, వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈసారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకుంది. ఇందులో భాగంగానే అనేక దశాబ్దాల రైతుల ఎదురుచూపు, ఏ-కై-క డిమాండ్ పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు-పై కీలక ప్రకటన చేసిన మోడీ నిజామాబాద్‌లో శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడే రెండు వేదికలు ఏర్పాటు- చేయగా, ఒక వేదికపై రాజకీయ, మరో వేదికపై అధికారిక ప్రసంగాలు చేసే అవకాశం వుందని తెలుస్తోంది. నిజామాబాద్‌లో జరిగే మోడీ సభను ‘ధన్యవాద్ సభ’గా జరపనున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలతో పాటు- కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. ప్రధాని రాక సందర్భంగా ఏర్పాట్లను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ దగ్గరుండి పర్యవేక్షించారు.
రూ.8 వేల కోట్ల పనులకు శంకుస్థాపన
నిజామాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ రూ.8,021 కోట్ల విలువైన ప్రాజక్టులను ప్రారంభించనున్నారు. ఎన్టీపీసీలో నూతంగా నిర్మించిన 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తారు. రూ.1,369కోట్లతో నిర్మించిన హెల్త్ సెంటర్స్‌కు మోడీ భూమి పూజ చేస్తారు. ఇందూరులో హెల్త్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు, రూ.1,300 కోట్లతో 493 బస్తీ దవాఖానలు, క్రిటికల్ కేర్ సెంటర్లను ప్రధాని ప్రారంభించనున్నారు. 20 జిల్లా కేంద్రాల్లో ఉన్న 50 పడకల ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాకులను నిర్మించనునున్నారు. అలాగే రూ.305 కోట్లతో 340 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పూర్తయిన రైల్వే లైన్లను మోడీ ప్రారంభించనున్నారు.