న్యూఢిల్లీ : పార్లమెంట్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పలు ఘటనల్లో భాగస్వామ్యం కావడం తన అదృష్టమని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.ఇలాంటి అదృష్టం కల్పించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. త్వరలోనే రాజ్యసభ పదవీ కాలం పూర్తయ్యే సభ్యులకు గురువారం సభ వీడ్కోలు పలికింది. రిటైర్ అయ్యే సభ్యులందరికీ.. చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడే అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముగింపు ఉపన్యాసం ఇచ్చారు. 20 నెలల తన పదవీకాలంలో అటు పాత పార్లమెంట్.. ఇటు కొత్త పార్లమెంట్ భవనాల్లో కూర్చునే అవకాశం దొరకడం ఆనందంగా ఉందన్నారు. అనేక దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న… మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇక్కడే ఇదే సభలో తమ పార్టీ తరపున మాట్లాడే అవకాశం రావడం చారిత్రక సంఘటనగా భావిస్తున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సమ్మక- సారలమ్మ గిరిజన యూనివర్సిటీ తాను ఎంపీగా ఉన్నప్పుడు మంజూరు కావడం మరిచిపోలేనిదన్నారు. కేంద్రం నుంచి నిధుల మంజూరులో రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందించాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి చేశారు.