కరీంనగర్ బస్ స్టేషన్ లో ఇటీవల పుట్టిన బిడ్డకు జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్ అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు బర్త్ డే గిప్ట్ గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ నెల 16న కుమారి అనే మహిళకు కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో బిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. ప్రసవ సమయంలో సహకరించి మానవత్వం చాటిన సిబ్బందిని హైదరాబాద్ బస్ భవన్ లో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ బుధవారం ఘనంగా సన్మానించారు. సకాలంలో కాన్పు చేసిన ఆర్టీసీ సిబ్బంది సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవాని, రేణుక, రజనీ కృష్ణ, అంజయ్య సేవలను ఎండీ వీసీ సజ్జనర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.