Monday, November 18, 2024

TG – బ‌తుక‌మ్మ చీర‌ల‌తో బ‌తుకుదెరువు – ఆర్డ‌ర్‌లు ఇవ్వండి – కాంగ్రెస్ స‌ర్కార్‌కు కేటీఆర్ హిత‌వు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్: నేతన్నలకు ఉపాధి కల్పించాల‌ని కాంగ్రెస్‌ సర్కార్‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ హితవు ప‌లికారు. ట్విట్ట‌ర్‌ (ఎక్స్) వేదిక‌గా ఆయ‌న మంగ‌ళ‌వారం పోస్టు చేశారు. అనాలోచిత నిర్ణయాల‌కు కాంగ్రెస్ స్వ‌స్తి చెప్పాల‌ని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నేతన్నలు, చేనేతలపై కక్ష గట్టి వారి ప్రాణాలు తీస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నేతన్నలు, చేనేతల ఆత్మహత్యలు నివారించి వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించామన్నారు. బ‌తుక‌మ్మ చీర‌ల ఆర్డ‌ర్‌తోనే వారి బ‌తుకులు బాగు ప‌డ‌తాయ‌ని చెప్పారు.

- Advertisement -

ఏడేండ్ల‌పాటు ఉపాధి క‌ల్పించాం..

ఏడేళ్ల‌ పాటు కొనసాగిన ఈ బతుకమ్మ చీరల ఆర్డర్ల కారణంగా రాష్ట్రంలో చేనేతలు, నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయాయని గుర్తు చేశారు. ఏటా రూ. 350 కోట్ల బడ్జెట్‌తో బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కోటి చీరలను పంపిణీ చేసేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ సదుద్దేశంతో చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కారణంగా పేద మహిళలకు పండుగ పూట ప్రభుత్వ కానుకగా చీర అందేదన్నారు. అదే విధంగా చేనేత కార్మికులు, నేతన్నలు అనుబంధంగా ఎంతో మంది ఉపాధి పొందేవారన్న పేర్కొన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేసిన కారణంగా ఇప్పటికే ప‌ది మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత చర్యలు మాని వెంటనే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి నేతన్నలు, చేనేతలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement