Wednesday, November 27, 2024

TG – యాసంగి వ‌చ్చింది… రైతు బంధు ఎక్క‌డ ?… రేవంత్ ను నిలదీసిన కెటిఆర్

రుణం తీరక, కొత్త రుణం లేక, అప్పు పుట్టక రైతన్న ఆగం
ప్ర‌జాపాల‌న‌లో రూ.20 వేల కోట్ల రైతు భ‌రోసాకు మంగ‌ళం
రూ.31వేల రుణమాఫీ అని.. 17 వేల కోట్లతో స‌రిపెడ‌తారా
పించ‌న్ కోసం పండుటాకులు విల‌విల
పైస‌లు కోసం వృద్ధులు ధ‌ర్నా
సీనియ‌ర్ సిటిజెన్ల‌పై క‌నిక‌రం లేని రేవంత్ స‌ర్కార్
ఎక్స్ వేదిక‌గా కెటిఆర్ నిల‌దీత

హైద‌రాబాద్ – వానాకాలం పోయి-మళ్లీ యాసంగి వచ్చింది..రైతు బంధు ఎక్కడా ? అంటూ కేటీఆర్‌ నిలదీశారు. యాసంగి పోయి -వానాకాలం వచ్చిందని… వానాకాలం పోయి-మళ్లీ యాసంగి వచ్చిందని కాంగ్రెస్‌ పై మండిపడ్డారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ చేశారు. నాడు గల్లా ఎగరేసిన రైతు-నేడు నేలచూపులు చూస్తున్నాడని నాడు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసిన రైతన్న నేడు ఆత్మన్యూనతతో తండ్లాడుతున్నడని మండిపడ్డారు. రుణం తీరక,కొత్త రుణం లేక, అప్పు పుట్టక రైతన్న ఆగమైతుండని… రైతుభరోసా మీద వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మాత్రం చలనం లేదని ఆగ్రహించారు.

రెండు విడతలుగా రూ.20 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టి రూ.31 వేల కోట్ల రుణమాఫీ అని ప్రకటించి రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసి తాంబూలాలు ఇచ్చాం తన్నుక చావండి అంటున్నారని నిప్పులు చెరిగారు. రూ.15 వేల రైతుభరోసా కోసం రైతులు, కౌలురైతులు ఎదురుచూస్తున్నారు… రూ.12 వేల రైతుభరోసా కోసంరైతుకూలీలు ఎదురుచూస్తున్నారని గుర్తు చేశారు. రెండు పంటలకేనా రైతుబంధు ? మూడో పంటకు ఇవ్వరా అని అధికారం కోసం బీరాలు పలికిండ్రు అంటూ చురకలు అంటించారు.

- Advertisement -

పించ‌న్ల కోసం పండుటాకుల ధ‌ర్నా…

నారాయ‌ణ‌పేట జిల్లా ధ‌న్వాడ మండ‌ల కేంద్రంలో వృద్ధులు పింఛ‌న్ల కోసం రోడ్డెక్క‌డంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌తి నెల పింఛ‌న్ల పంపిణీలో జాప్యం జ‌రుగుతుంద‌ని వృద్ధులు ధ‌ర్నాకు దిగారు. స‌మ‌యానికి పింఛ‌న్ ఇవ్వాల‌ని వారు డిమాండ్ చేశారు. ఈ ధ‌ర్నాపై కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. ఇలా అవుతుంద‌ని ఎవరు అనుకోలేదు. తెలంగాణాలో పింఛన్ల కోసం వృద్దులు రోడ్డెక్కుతారని, టంచన్‌గా అకౌంట్లో పడే పైసలు ఆగిపోతాయని ఎవరూ అనుకోలేద‌ని అన్నారు. మూసీ సుంద‌రీక‌ర‌ణ‌ కోసం లక్షా యాభై వేల కోట్లు వెదజల్లి… కనికరం లేకుండా వృద్దుల పెన్షన్ డబ్బులను ఆపుతారని ఎవరనుకున్నారు? అని కేటీఆర్ నిల‌దీశారు. మందుబిళ్లల కోసం కొడుకులు , కోడళ్ల‌ దగ్గర చేయిచాచే అవసరమే లేని రోజుల నుంచి మళ్లీ వేడుకునే ‘మార్పు’ వస్తుందని ఎవరనుకున్నారు? అని తెలిపారు. అణువణువునా కర్కశత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా ఇక్కట్లే ఉంటాయని ఎవరనుకున్నారు? అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మార్పు ఇంత మోసగిస్తుందని ఎవరనుకున్నారు? అంటూ కేటీఆర్ మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement