Friday, January 10, 2025

TG – పాలమూరు జిల్లాను అన్నపూర్ణగా తీర్చిదిద్దుతాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పాలమూరు – వలసల జిల్లాలో సాగునీరుపారించి అన్నపూర్ణగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కృష్ణా నదిపై కోయిల్ సాగర్, బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులు ప్రారంభించి పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలే అని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సైతం జీవో ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలిపారు.

- Advertisement -

కృష్ణా నదిపై ఎలిమినేటి మాధవరెడ్డి, శ్రీశైలం సొరంగం, డిండి వంటి ప్రాజెక్టులు ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తాం అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం హోదాలో తాను, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ మంత్రి జూపల్లి లు కలిసి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల ప్రగతి పై సమీక్షించామని తెలిపారు.

మీ అందరి కృషి వల్ల ప్రజా ప్రభుత్వం ఏర్పడింది

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. క్యాబినెట్ లోని మంత్రులందరూ 18 గంటల పాటు ప్రజల కోసం పనిచేస్తున్నారు.. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న ఆలోచన పార్టీ శ్రేణులు చేయాలని పిలుపునిచ్చారు.

రైతు రుణమాఫీ ఎక్కడ జరిగిందంటూ కేటీఆర్, హరీష్ అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. రైతు భరోసా ఐదు ఎకరాలకు ఇవ్వాలని, 10 ఎకరాలకు ఇవ్వాలని అభిప్రాయం వెల్లడించారు. ఈ విషయాన్ని శాసనసభలో చర్చకు పెట్టి. సాగు యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించిందని తెలిపారు. రైతు భరోసాను పదివేల నుంచి ఇందిరమ్మ ప్రభుత్వం 12 వేలకు పెంచిందన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26 నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా 8400 కోట్లు నగదు జమ చేస్తాం అన్నారు.

ఎవరు ఆలోచన చేయని విధంగా భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద జనవరి 26 నుంచి 12 వేల నగదు వారి ఖాతాల్లో జమ చేయబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు అన్న కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో కరెంటు ఉత్పత్తి పరిశ్రమను ఒక్కదానిని పూర్తి చేయలేదు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement