ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం మార్కెట్‌ను ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం పత్తి మార్కెట్‌లో బుధవారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో దాదాపు 400 పత్తి బస్తాలు అగ్నికి ఆహూతయ్యాయి. సంక్రాంతికి ముందు కొందరు వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తి అగ్ని ప్రమాదంలో బూడిదైంది. ఈ ఘటనపై రాత్రే స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గురువారం ఖమ్మం మార్కెట్‌ను పరిలిశీలించారు.
పత్తి కాలిపోవడం దురదృష్టకరం
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాత్రి పత్తి కాలిపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. రైతులకు, వ్యాపారస్తులకు సౌకర్యంగా ఉండేలా కొత్త మార్కెట్‌ను నిర్మిస్తా అని మంత్రి హామీ ఇచ్చారు. ‘మార్కెట్‌లో రాత్రి పత్తి కాలిపోవడం దురదృష్టకరం. కారణం ఏంటో ఇంకా తెలీదు. నష్టం అంచనా వేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తా. ఈ మార్కెట్‌ను రూ.100 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తా. ’ అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.
మద్దులపల్లి మార్కెట్‌ను పది రోజుల్లో ప్రారంభం
‘మిర్చి మార్కెట్ కారణంగా చుట్టుపక్కల ప్రజలు నా మీద ఫిర్యాదులు చేస్తున్నారు. మద్ధులపల్లి మార్కెట్‌ను 10, 15 రోజుల్లో ప్రారంభిస్తాం. ఖమ్మం మార్కెట్‌కు, ప్రజలకు ఒత్తిడి సమస్యలు ఉండకూడదు. మార్కెట్ నిర్మాణం కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. అతి త్వరలో మార్కెట్‌కు స్వరూపం మారాలి, అప్పటివరకు రైతులు అంతా సంయమనం పాటించాలి. మార్కెట్‌లో ఓ ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేస్తాం. గతంలోనూ ఉండేది, ఇప్పుడు ఏర్పాటు చేస్తాం. పసుపు బోర్డు వేరే రాష్ట్రాల్లో కావాల్సి ఉండగా.. నేను మన రాష్ట్రానికి కావాలని కోరాను. ప్రధాని నా అభ్యర్థన మేరకు బోర్డు ప్రకటించారు’ అని మంత్రి తుమ్మల చెప్పారు.