Thursday, November 28, 2024

TG – రేవంత్ పై పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇస్తాం – హ‌రీశ్ రావు

మూసీ పునర్జీవ‌నంలో అక్క‌డొక మాట‌.. ఇక్క‌డొక మాట‌
మూసీ ప్ర‌క్షాళ‌న‌పై బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధం
రంగ‌నాయ‌క భూ ఆక్ర‌మ‌ణ‌లపై విచార‌ణ జ‌ర‌పండి
రేవంత్ పై హ‌రీశ్ రావు స‌వాల్

హైదరాబాద్: ప్రజలనే కాదు.. పార్లమెంట్‌ను సైతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తీన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, మల్లన్నసాగర్‌లో తాను భూములు ఆక్రమిస్తే విచారణ జరిపించాల‌ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రేవంత్ చేతిలోనే ఉందని, వెంట‌నే విచార‌ణ చేయాల‌ని సవాల్ విసిరారు.

ఒక్క గుంట ఆక్రమించలేదు..

రంగనాయక్‌ సాగర్‌ దగ్గర హరీశ్‌రావు ఇరిగేషన్‌ భూములు ఆక్రమించాడంటూ ముఖ్యమంత్రి నిరాధార ఆరోపణలు చేశారని హరీశ్‌ రావు ధ్వజమెత్తారు. తాను నిబంధనలకు లోబడి ధరణి ద్వారా భూమిని కొనుగోలు చేశానని, ఒక్క గుంట కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రికి వాటిని నిరూపించాల్సిన బాధ్యత ఉందని, ఆయన ఎప్పుడు వస్తారో చెబితే తాను ఆ భూమి వద్దకు వస్తానని రేవంత్‌ రెడ్డికి సవాలు విసిరారు. ప్రాజెక్టుల కోసం సేకరించిన భూమిని బదలాయించుకుని హరీశ్‌రావు రంగనాయక సాగర్‌లో ఫామ్‌హౌస్‌ నిర్మించారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. సీఎం ఆరోపణలపై హరీస్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఒక్క గుంట భూమి ఆక్రమించినట్టు తన చరిత్రలోనే లేదని, ఆక్రమణల చరిత్ర ముఖ్యమంత్రికే ఉందంటూ ధ్వజమెత్తారు. ఆక్రమణలలో మునిగితేలే రేవంత్‌ రెడ్డికి అందరూ దొంగల్లానే కనిపిస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ను అమలు చేయలేక ప్రతిపక్షంపై నిందలు వేస్తూ రేవంత్‌ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. 11 నెలల కాలంలో సీఎం, ఆయన మంత్రులు చేసిందేమీ లేదని విమర్శించారు. లోపాలను ఎత్తిచూపుతున్న కేటీఆర్‌పై కేసులు పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

పార్లమెంట్‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన రేవంత్

- Advertisement -

మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని మండిపడ్డారు హ‌రీశ్ రావు. కేంద్రాన్ని, పార్లమెంట్‌ను రేవంత్ ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని అన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నామని పార్లమెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని అన్నారు. రేవంత్‌కు సోనియాగాంధీపై ప్రేమ, గౌరవముంటే యూపీఏ ప్రభుత్వం తెచ్చిన 2013భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. రేవంత్‌పై పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్‌కు మూవ్ చేస్తామని అన్నారు.

మూసీపై బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధం ..

మూసీపై సీఎంతో బహిరంగ చర్చకు సిద్ధమ‌ని, ఎక్కడకు రావాలో చెప్పాలని రేవంత్ కు సవాల్ విసిరారు హ‌రీశ్ రావు. మూసీపై అఖిలపక్షానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన ముఖ్యమంత్రి తోక‌ ముడిచారని ఎద్దేవా చేశారు. మూసీపై ప్రభుత్వాన్ని బాధితుల పక్షాన శాసనసభలో నిలదీస్తామన్నారు. 2014 భూసేకరణ చట్టం ప్రకారం మల్లన్నసాగర్, కొండపోచమ్మ నిర్వాసితులకు పరిహారం చెల్లించామని గుర్తుచేశారు.

కూల్చిన ఇళ్ల‌కు న‌ష్ట ప‌రిహారం ఎవ‌రిస్తారు..

కట్టిన ఇళ్లను కూల్చమంటున్నారు సరే.. హైడ్రా కూల్చిన ఇళ్ల సంగతి ఏంటని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం చేసిన పాపానికి శిక్ష ఎవరికి వేయాలని నిలదీశారు. ఇప్పటికే కూల్చిన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మూసీ బాధితులను కేసీఆర్ ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లల్లోకి నెట్టి.. రేవంత్ గొప్పలు చెబుతున్నారని హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

6,213 స్కూళ్ల మూసివేత‌కు రేవంత్ కుట్ర

ప్రతి చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్, ప్రతి రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, హైస్కూల్ ఏర్పాటు చేస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలికారని అయితే అధికారంలోకి వచ్చి సంవత్సరం కాకముందే జీరో స్కూల్ పేరిట 1,899 స్కూల్‌లు, 10 మందిలోపు విద్యార్థులు 4,314 స్కూళ్లు మొత్తం కలిపి 6,213 స్కూల్స్‌ని శాశ్వతం గా మూసి వేసే ప్రణాళిక లో భాగంగానే ఆ స్కూల్లో పనిచేసే 5,741 మంది టీచర్లను బదిలీ చేస్తున్నారని మండిపడ్డారు హ‌రీశ్ రావు .
కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం 7,289 కోట్లతో మన ఊరు – మన బడి, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం సన్న బియ్యంతో పౌష్ఠిక ఆహారం అందించారని హరీశ్‌రావు గుర్తు చేశారు. రేవంత్ సర్కారు వచ్చీ రాగానే సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం రద్దు చేయడం, మన ఊరు మన బడి ప్రోగ్రాం కొనసాగించకపోవడం, పురుగులన్నం, విషాహారంతో మధ్యాహ్న భోజనం వల్ల ప్రభుత్వ పాఠశాల పరపతి తగ్గి ఎన్‌రోల్‌మెంట్‌ తగ్గుతోందని పేర్కొన్నారు. ఒక్క సంవత్సరం లోనే 6,213 ప్రభుత్వ స్కూల్స్ మూత పడే దుస్థితికి రేవంత్ సర్కారు దిగజార్చిందని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement