Home తెలంగాణ‌ TG – ఉత్త‌మ అసెంబ్లీ ప‌ర్స‌న్ అవార్డు ప‌రిశీలిస్తాం – స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌

TG – ఉత్త‌మ అసెంబ్లీ ప‌ర్స‌న్ అవార్డు ప‌రిశీలిస్తాం – స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌

0
TG –  ఉత్త‌మ అసెంబ్లీ ప‌ర్స‌న్ అవార్డు ప‌రిశీలిస్తాం – స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌

అసెంబ్లీలో అర్ధవంతమైన చ‌ర్చ‌లు జ‌ర‌గాలి
స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌
పీఏ, పీఆర్ఓల వ‌ల్లే ప్ర‌జ‌ల‌తో పెరుగుతున్న దూరం
ప్ర‌జ‌ల‌తో నేరుగా ఫోన్‌లో మాట్లాడాలి
మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి
శాస‌న‌స‌భ ఏ ఒక్క‌రిదో కాదు
57 మంది కొత్త‌వారు
శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ ఉత్తమ పార్లమెంటరీయన్ మాదిరిగా ఉత్తమ అసెంబ్లీ పర్సన్ అవార్డు పరిశీలన చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లడించారు. బుధవారం నుంచి రెండు రోజుల‌పాటు ఎంసీహెచ్‌ఆర్‌డీలో శాసన సభ, మండలి సభ్యుల ఓరియెంటేషన్ శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు. గతంలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వెంకయ్యనాయుడు వంటి గొప్ప వ్యక్తులు బాగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. చట్టాలను రూపొందించే హక్కు శాసన సభ్యులకు ఉంటుందన్నారు. గతంలో శాసనసభ సమావేశాలు ఉంటే ప్ర‌జ‌లు చూడ‌ర‌ని సినిమా రిలీజ్ వాయిదా వేసుకునేవారని చెప్పారు. మళ్లీ అలాంటి అర్ధవంతమైన చర్చలతో కూడిన సమావేశాలు జరుగాలని ఆకాంక్షించారు.

పీఏ, పీఆర్వోలే కార‌ణం
ప్రజాప్రతినిధులకు..ప్రజలకు మధ్య దూరం పెరగడానికి, ఎన్నికల్లో ఓడిపోవడానికి వాళ్ల పీఏలు, పీఆర్వో లు ప్రధాన కారణమవుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప్ర‌సంగించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడేందుకు ప్రజలు లేక ఎవరైనా ఫోన్ చేస్తే పీఏలు, పీఆర్వోలు దురుసుగా మాట్లాడతారని, తద్వారా వారిపై కోపం ప్రజాప్రతినిధులపై కోపంగా మారిపోతుందని చెప్పారు. గన్ మెన్‌లతో కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తోందన్నారు.

ప్ర‌జ‌ల‌తో నేరుగా ఫోన్‌లో మాట్లాడాలి
ప్రజాప్రతినిధులే ప్రజలతో ఫోన్ లో టచ్ లో ఉండాలని గుత్తా సూచించారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తే ఆవేదన కలుగుతోందన్నారు. గాలివాటం రాజకీయాలు మొదలయ్యాక కొత్త ఎమ్మెల్యేలే సభలోకి వస్తున్నారన్నారు. ఎన్నికలు ఖరీదైనవిగా మారిపోయాయన్నారు. తాము సభాపతిగా ఉన్నా సభ ఎన్ని రోజులు నడపాలనే నిర్ణయం ప్రభుత్వానిదేనని, ప్రభుత్వం ఎక్కువ రోజులు సభ నిర్వహించాలనుకుంటే ఎక్కువ రోజులు నడుస్తుందంటూ చెప్పారు.

శాస‌న‌స‌భ ఏ ఒక్క‌రిదో కాదు : మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు
శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ శాసనసభ ఏ ఒక్కరిదో కాదని… ఈ ట్రైనింగ్ సెషన్స్‌కు అందరికీ ఆహ్వానం పంపామని తెలిపారు. శాసనసభ అందరికీ అని… కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌దో వేరే ఇంకా ఎవరిదో కాదని చెప్పారు. పాత రోజుల్లో సిద్ధాంతపరంగా భేదాభిప్రాయాలు ఉన్నా… సభలో ఎవరి పాత్ర వారు పోషించారన్నారు.

57 మంది కొత్త‌వారు
మొదటిసారి ఎన్నికైన శాసనసభ్యులు 57 మంది ఉన్నారని, వారికి సీనియర్ సభ్యులు ఆదర్శంగా ఉండాలని మంత్రి శ్రీ‌ధ‌ర్ అన్నారు. తాను మొదటిసారి ఎన్నికైనప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉందని, ఎప్పుడు మాట్లాడే అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూసేవాళ్లమన్నారు. తాను నాలుగోసారి సభలో ఉన్నప్పుడు పీఏసీ ప్రతిపక్షానికి ఇవ్వలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు అందరూ శాసనసభకు హాజరయ్యే సాంప్రదాయం కొనసాగించాలని, ఎమ్మెల్యేగా గెలిచి సభ రాకుండా దూరంగా ఉండటం రాజ్యాంగ విలువలను అవహేళన చేయడమేనన్నారు.

Exit mobile version