Friday, September 27, 2024

TG – మూసి ప‌రివాహక ప్రాంతాన్ని ప‌ర్యాట‌కంగా అభివృద్ధి చేస్తాం – రేవంత్

హైద‌రాబాద్ – మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణ కు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ‌తామ‌ని తెలిపారు.  

హైదరాబాద్ లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐఐ తో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది. ఈ  కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు.  గత ప్రభుత్వాల నిర్లక్ష్యంగా కారణంగా నగరంలోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని సీఎం అన్నారు. ప్రస్తుతం పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్దరిస్తున్నామని , త్వరలోనే అందులో శాసన మండలి ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ముఖ్యమంత్రి వెల్ల‌డించారు.

ప్రస్తుతం శాసనమండలి ఉన్న జూబ్లీ హాల్ కు చారిత్ర‌క ప్రాధాన్యత ఉందన్నారు. ప్రత్యేక టెక్నాలజీతో ఆ భవనాన్ని నిర్మించారని, భవిష్యత్తులో దాన్ని పరిరక్షించాల్సిన అవసరముందని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. జూబ్లీహాల్ ను దత్తత తీసుకొని పరిరక్షించాలని ఆయన సీఐఐ కి సూచించారు. ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని పరిరక్షిస్తామని, ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ స్టేడియానికి తరలిస్తున్నట్లు సీఎం వివరించారు.

- Advertisement -

హైకోర్టు భవనాన్ని కూడా రక్షించాల్సిన అవసరముందని సీఎం అన్నారు. రాజేంద్రనగర్ లో హైకోర్టు నూతన భవనం నిర్మాణం కోసం 100 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్ సిటీ కాలేజ్ భవనంతో పాటు పురానాపూల్ బ్రిడ్జి వంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసర‌ముందన్నారు. ఇప్పటికే చార్మినార్ పరిరక్షణ ప్రాజెక్ట్ కొనసాగుతోందన్నారు.

పురాతన బావులు దత్తత తీసుకున్న పారిశ్రామికవేత్తలు 

నగరంలో పురాతన మెట్ల బావు లను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ఈ మేర‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు ఒప్పంద పత్రాలు అందజేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్దరణకు ఇన్పోసిస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. సాయి లైఫ్ సంస్థ మంచిరేవుల మెట్ల బావిని దత్తత తీసుకుంది. భారత్ బయోటెక్  సంస్థ సాలార్ జంగ్,  అమ్మపల్లి  బావుల‌ను పునరుద్దరించనున్నది. అడిక్‌మెట్  మెట్ల బావిని  దొడ్ల డైరీ, ఫలక్ నుమా మెట్ల బావిని టీజీ ఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి ఉమెన్స్ కాలేజీ పునరుద్దరించనున్నది. 

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని.. 

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉచితంగా రాష్ట్రంలో పర్యాటక, చారిత్ర‌క ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందు కోసం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని తీసుకువచ్చామ‌ని, దానికి సంబంధించిన జీవోను ఇప్ప‌టికే జారీ చేశామన్నారు. చారిత్ర‌క‌, పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణ దర్శిని  తీసుకువచ్చినట్లు సీఎం  వివరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్, సీఐఐ తెలంగాణ ఛైర్మన్ సాయి ప్రసాద్, ముఖ్యమంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, ముఖ్య‌మంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.

వయాట్రీస్- హరే కృష్ణ ఛారిటబుల్ ఫౌండేషన్ ఒప్పందం

సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ కోసం వయాట్రీస్(Viatris)-హరే కృష్ణ ఛారిటబుల్ ఫౌండేషన్ ల మధ్య ఒప్పందం కుదిరింది.
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఫౌండేషన్ సీఈఓ కౌంతేయ దాస, కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మిషెల్ డొమినికా ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని 312 స్కూళ్లల్లో చదువుతున్న 28 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందుబాటులోకి రానుంది. సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా వయాట్రీస్ సంస్థ రూ.6.4కోట్ల విరాళం అందించింది.

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం అందజేసిన భారత్ బయోటెక్ .

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి కోటి రూపాయిల చెక్ నుభారత్ బయోటెక్ కో-ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా నేడు అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా విరాళ‌మిచ్చిన బ‌యోటెక్ యాజ‌మాన్యాన్ని అభినందించారు రేవంత్.

Advertisement

తాజా వార్తలు

Advertisement