హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌కు సమానంగా వరంగల్ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని రాష్ట్ర రెవెన్యూ , సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరంగల్ ప్రాముఖ్యతను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారన్నారు.
హైదరాబాద్ స్థాయిలో వరంగల్…
హైదరాబాద్ స్థాయిలో వరంగల్‌ను తీర్చిదిద్దడంలో భాగంగా మొదటి సంవత్సరం పూర్తి కాకముందే సీఎం రేవంత్ రెడ్డి రెండు పర్యాయాలు వరంగల్ పట్టణానికి వచ్చారని పొంగులేటి గుర్తుచేశారు. మొదటిసారి పర్యటన సందర్భంగా చేయాల్సిన అభివృద్ధిపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి అభిప్రాయాలను తీసుకున్నారన్నారు. ఎయిర్ పోర్ట్, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నాకు బాధ్యతలు అప్పగించారని తెలిపారు. రెండో పర్యాయం వచ్చినప్పుడు అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారని, రూ. ఆరు వేల కోట్ల నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు. 2041 మాస్టర్ ప్లాన్ మంజూరు చేయడం జరిగిందని, భద్రకాళి చెరువు పూడికతీత, వివిధ అభివృద్ధి, మౌలిక వసతులు కల్పన టెండర్లు పిలిచామని పొంగులేటి పేర్కొన్నారు.
నెలాఖరులో ఇందిరమ్మ!
ఈ సంవత్సరం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున మంజూరు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రానున్న నాలుగు సంవత్సరాల్లో అర్హులందరికీ గృహాలను నిర్మించే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యంత నిరుపేదలను పారదర్శకంగా గుర్తించి, వారికి జనవరి 31లోగా మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ నెల 26వ తేదీ నుంచి రైతు భరోసాతో పాటు రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 3 పథకాలను అమలు చేస్తామని తెలిపారు.
యాప్‌లో 65 లక్షల మంది వివరాలు..
రాజకీయాలకతీతంగా అందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం అపరిష్కృతంగా వదిలేసిన 1.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి అర్హులకు అందిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు 80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటికే 65లక్షల మంది వివరాలను యాప్‌లో నమోదు చేశామని వెల్లడించారు. టీజీఎస్ఆర్టీసీని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సంక్రాంతిలోపు రెండో విడతలో మరిన్ని ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించబోతున్నామని తెలిపారు.