కరీంనగర్ – అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. పేదలందరికీ కార్డులు ఇస్తామని, ప్రతిపక్షాలు ఆరోపించినట్లు ఎవ్వరూ భయపడొద్దని మంత్రి చెప్పారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు గ్రామసభలో ఉత్తమ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజాపాలన దరఖాస్తులు అన్నీ పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈరోజు దరఖాస్తు ఇచ్చినా రేషన్ కార్డు ఇస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. పదేళ్లపాటు రేషన్ కార్డులు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా జనవరి 21 నుంచి గ్రామసభలు ప్రారంభమయ్యాయి. గ్రామసభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈనెల 24 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అప్లికేషన్లు వస్తున్నాయి. కాగా, ఈనెల 26న నుంచి అర్హులకు రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేయనుంది.