వినాయక చవితి పండుగను ఎంతో సంబురంగా జరుపుకోవాలని ఆశపడి.. అందుకోసం వినాయకుడి విగ్రహం తెచ్చి, ఆ దేవదేవుడిని అందమైన మండపంలో కొలుదీర్చాలని.. మండపాన్ని ముస్తావు చేస్తున్న క్రమంలో ఓ భక్తుడు ప్రాణాలు విడిచాడు. ఈ విషాధ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్టేషన్ పరిధిలోని దూలపల్లిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..దూలపల్లికి చెందిన నవీన్ చారి (28) బస్సు బాడీ కూలీగా పనిచేస్తున్నాడు. తన చుట్టుపక్కల యువకులతో కలిసి.. గణపతిని పెట్టాలని కమిటీలో చేరి.. ఎంతో చురుగ్గా అన్ని పనులు చేశాడు. కానీ, దురదృష్టవశాత్తు శుక్రవారం రాత్రి వినాయక మండపానికి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో కరెంట్ షాక్‌తో నవీన్ మృతి చెందాడు.
గత వారం రోజులుగా వర్షాలు పడుతుండటంతో ముందు జాగ్రత్తగా మండపం పై నుంచి వర్షం నీరు కిందకు రాకుండా టార్పాలిన్‌తో కట్టేందుకు సిద్ధం అయ్యాడు నవీన్.టార్పాలిన్ కప్పిన తర్వాత.. అది గాలికి ఎగిరిపోకుండా ఉండేందుకు దాని పైనుంచి బైండింగ్ వైర్‌తో కట్టాలని.. ఒక చేత్తో బైండింగ్ వైర్ పట్టుకుని మరో చేత్తో మండపం పైకి విసిరాడు. బైండింగ్ వైరు విద్యుత్ తీగలపై పడటంతో నవీన్‌చారి షాక్‌తో కింద పడి, అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అక్కడే ఉన్న వడ్డ శంకర్ అనే మరో వ్యక్తి కర్ర సహాయంతో నవీన్ చారిని పక్కకు తప్పించే ప్రయత్నం చేయగా అతనికి కూడా విద్యుత్ షాక్ తగిలింది….
దీంతో శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు శంకర్‌ను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను కూడా మృతి చెందాడు. ఇలా పండుగరోజు, దేవుడిని ప్రతిష్ఠించే క్రమంలో ఇద్దరు యువకులు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.