Tuesday, July 2, 2024

TG | సింగరేణి సీఎండీ బలరాంకు ప్రతిష్టాత్మక అవార్డు…

సింగరేణి కంపెనీ ఎండీ ఎన్.బలరాంకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. గ్రీన్ మాపుల్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకమైన “ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ” అవార్డును ఎన్.బలరామ్‌కు అందజేసింది. సింగరేణి సంస్థను పర్యావరణ సంక్షేమ సంస్థగా మార్చడమే కాకుండా… తానే స్వయంగా 18 వేలకు పైగా మొక్కలు నాటి, తెలంగాణలోని 6 జిల్లాల్లో 35 మినీ ఫారెస్ట్‌లను సృష్టించినందుకు గుర్తింపుగా సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ కు ఈ అవార్డును అంద‌జేశారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్రీన్ మాపుల్ ఫౌండేషన్-2024 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆ సంస్థ ఎండీ అశుతోష్ వర్మ, ఎన్టీపీసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల సీనియర్ అధికారులు సింగరేణి సీఎండీ ఎన్.బలరాంకు ఈ అవార్డును అందజేశారు. ప్రతి సంవత్సరం, గ్రీన్ మాపుల్ దేశంలోని పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ప్రముఖ ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలకు ప్రభావవంతమైన వ్యక్తులకు ఇటువంటి ప్రోత్సాహక అవార్డులను అందజేస్తుంది.

ఈ సందర్భంగా చైర్మన్ ఎన్.బలరాం మాట్లాడుతూ…. బొగ్గు ఉత్పత్తి చేస్తున్న తమ సంస్థ నిబంధనల ప్రకారం పచ్చదనాన్ని పరిరక్షించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, సింగరేణి వ్యాప్తంగా 6 కోట్లకు పైగా మొక్కలు నాటామన్నారు. సింగరేణి సంస్థ చేపడుతున్న పర్యావరణ సంక్షేమ చర్యలకు గుర్తింపుగా 2021-22 సంవత్సరంలో కంపెనీని కార్బన్ న్యూట్రాలిటీ కంపెనీగా CMPDI గుర్తించిందని పేర్కొన్నారు.

- Advertisement -

‘ప్రతీ అడుగు పచ్చదనం’ అనే నినాదంతో సింగరేణిలో మొక్కలు నాటే యజ్ఞాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది వన మహోత్సవంలో మరో 2 వేల మొక్కలు నాటాలని వ్యక్తిగత లక్ష్యం పెట్టుకున్నట్లు వివరించారు. దీంతో 20 వేల మొక్కలు నాటినట్లు అవుతుందన్నారు. ఈ ఏడాది 40 లక్షల మొక్కలు నాటేందుకు సంస్థ సిద్ధంగా ఉందన్నారు.

అలాగే సింగరేణి పాఠశాలల్లో చిన్నతనం నుంచే పర్యావరణ స్ఫూర్తిని పెంపొందించేందుకు పర్యావరణ సిలబస్‌ను బోధిస్తున్నామని….. ప్రతి తరగతిలో గ్రీన్ కెప్టెన్లను నియమిస్తున్నామని, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.

తనకు ఈ అవార్డు ప్రకటించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈ అవార్డు సింగరేణిలోని పర్యావరణ వేత్తలందరికీ చెందుతుందని అన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని పర్యావరణహిత కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ, ఆయిల్ ఇండియా తదితర సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement