Wednesday, December 4, 2024

TG – రాజ‌కీయాల‌లో ఆర్య‌వైశ్యుల‌కు ప్రాధాన్య‌త ఇస్తాం – రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – రాజ‌కీయాల‌లో ఆర్య‌వైశ్యుల‌కు స‌ముచిత ప్రాధాన్య‌త క‌ల్పిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. అలాగే ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల‌కు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన సేవ‌లు అందించిన మాజీ అర్ధిక మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, దివంగ‌త కొణిజేటి రోశ‌య్య విగ్ర‌హాన్ని హైద‌రాబాద్ లో ఏర్పాటు చేస్తామ‌ని అన్నారు..

హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేడు జ‌రిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కోణిజేటి రోశయ్య వర్థంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రోశ‌య్య చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లో రోశయ్య సూచనలతో రాజకీయాలపై తాను అవగాహన పెంచుకున్నానని అన్నారు. ఆయనను ఎదిరిస్తూ తాను శాసనమండలిలో మాట్లాడానని గుర్తు చేశారు.

మిగులు బ‌డ్జెట్ ఆయ‌న ఘ‌న‌తే

- Advertisement -

రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందంటే రోశయ్య 16 ఏళ్లు ఆర్థిక మంత్రిగా పని చేయడమే కారణమని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రోశయ్య తనకు చెప్పేవారని సీఎం అన్నారు. ఆయన సూచనలతోనే రాజకీయాలపై అవగాహన పెంచుకున్నానని తెలిపారు. ముఖ్యమంత్రులు ధీమాగా అన్ని సంవత్సరాలు పాలించారంటే రోశయ్య ఆర్థిక మంత్రిగా ఉండటం ఓ కారణమని అన్నారు.

రాష్ట్రానికి సీఎంగా ఎవరున్నా రోశయ్యకు నెంబర్ 2 పొజిషన్ పర్మినెంట్‌గా ఉండేదని అన్నారు. తనకు పదవి కావాలని ఎవరినీ ఏనాడు ఆయన అడగలేదని తెలిపారు. ఆయనకు ఉన్న ప్రతిభ, క్రమశిక్షణే వల్లే వివిధ హోదాలు దక్కాయని సీఎం అన్నారు. చట్టసభల్లో రోశయ్య బలమైన ముద్ర వేశారని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక రంగంలో రాణించాలంటే ఆర్యవైశ్యుల పాత్ర ప్రముఖమని అంటూ రాజ‌కీయాల‌లో ఆర్య‌వైశ్యులు చురుగ్గా పాల్గొనాల‌ని రేవంత్ పిలుపు ఇచ్చారు.. ఆర్యవైశ్యులు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లు కావాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement