హైదరాబాద్ – తెలంగాణ మంత్రివర్గం సమావేశం నేడు జరగనుంది. . సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ కానుంది.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటన జారీ చేశారు.
మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. హైడ్రాకు చట్టబద్ధతతో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ అధికారాలు ఇటీవలనే హైడ్రాకు కట్టబెడుతూ పురపాలకశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ యాక్ట్ చట్ట సవరణ బిల్లుపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది.
ఇక వచ్చే అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు చర్చించే అంశాలపై కూడా సమాలోచనలు చేయనున్నారు. ఇవే కాకుండా ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు, కొత్త రేషన్ కార్డులతో పాటు కుల గణన వంటి అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది..
!మూసీ ప్రక్షాళనపై కీలక చర్చ..!
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రక్షాళలను సీరియస్ గా తీసుకుంది. పరివాహన ప్రాంతంలో ఉన్న నిర్వాసితులకు ఇళ్లను కేటాయించే పనిలో పడింది. ఇప్పటికే చాలా ఇళ్లకు మార్కింగ్ కూడా చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా మూసీ సుందరీకరణను తీసుకుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీలో ఈ విషయంపై లోతుగా చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇటీవలనే మంత్రుల బృందం సియోల్ లో పర్యటించింది. దక్షిణ కొరియాలోని నదుల అభివృద్ధిని అధ్యయనం చేసింది. ఈ నివేదికలపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు.
ఇక రాష్ట్రంలో చాలా మంది రైతులు పంట పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం తీసుకొచ్చిన రైతు భరోసా స్కీమ్ పై కేబినెట్ చర్చించనుంది. విధివిధానాలను ఖరారు చేసే అంశంపై సమాలోచనలు చేయనుంది.
ఇక రుణమాఫీ స్కీమ్ కూడా చర్చకు రానుంది. ఈ నెలాఖారులోపు మిగిలిపోయిన రైతులకు కూడా రుణమాఫీ స్కీమ్ వర్తింపజేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉంది.
డీఏలపై ప్రకటనకు ఛాన్స్…!
రెండు రోజుల కిందట తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు… సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మూడు గంటలకుపైగా చర్చించారు. పెండింగ్ డీఏలతో పాటు దాదాపు 50 సమస్యలపై మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఐదు పెండింగ్ డీఏల విషయంపై చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని…. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. శుక్రవారం సాయంత్రంలోపు నిర్ణయం చెబుతామని చెప్పినటికీ… ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఇవాళ మంత్రివర్గ సమావేశం ఉండటంతో… ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. పెండింగ్ డీఏలపై ప్రకటన చేసే అవకాశం ఉంది.