Home తెలంగాణ‌ ఆదిలాబాద్ TG – జత కోసం జ‌ర్నీ! … బోర్డర్​ దాటి వస్తున్న మగ పులులు

TG – జత కోసం జ‌ర్నీ! … బోర్డర్​ దాటి వస్తున్న మగ పులులు

0
TG –  జత కోసం జ‌ర్నీ! …  బోర్డర్​ దాటి వస్తున్న మగ పులులు

ఛత్తీస్‌గఢ్‌, మ‌హారాష్ట్ర‌ కీకారణ్యం నుంచి రాకపోకలు
ఇంద్రావతి, తాడోబా టైగర్​ రిజర్వ్​ నుంచి బయటికి
ఆదిలాబాద్​, ఓరుగల్లు ప్రాంతంలో పులుల సంచారం
పగ్​ మార్క్స్​ ఆనవాళ్లను గుర్తించిన అటవీశాఖ అధికారులు
తాగునీరు, ఆహారం, ఆవాసం ఇప్పుడు వాటికి కీలకం
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో అలికిడి
పుచ్చ పంటలో సంచరించినట్టు పాద ముద్రలు
ఆడ తోడు కోసమే మగపులుల వెంపర్లాట
రోజూ 40 నుంచి 60 కిలోమీటర్ల దాకా ప్ర‌యాణం
స్పష్టం చేసిన అటవీ శాఖ అధికారులు
ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచనలు

ఆంధ్రప్రభ స్మార్ట్​, సెంట్రల్​ డెస్క్ : ఎటు చూసినా పచ్చదనం, ఎత్తైన గుట్టలు ఎన్నో వృక్షజాతులు మరెన్నో వన్యప్రాణులు. గోదావరి పరవళ్లు ప్రకృతి రమణీయతతో ఉమ్మడి వరంగల్‌ అభయారణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. ఏటూరునాగారం, పాకాల అరణ్యం ఒకప్పుడు పెద్ద పులులకు ఆవాసం. ఇప్పుడు మరోసారి ఈ ప్రాంతంలో పులి అలికిడి కనిపించింది. ఆహారానికి సరిపడా వన్యప్రాణులు, తాగునీరు, సేద తీరేందుకు అనువైన అటవీ ప్రాంతం ఉండ‌డంతో పులులు ఈ ప్రాంతానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఇంద్రావతి, తాడోబా టైగర్‌ రిజర్వుల నుంచే..

ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి, మహారాష్ట్రల్లోని తాడోబా టైగర్‌ రిజర్వుల్లో పులుల సంఖ్య ఎక్కువైంది. అక్కడ ఆహార కొరత ఏర్పడటంతో గోదావరి, ప్రాణహిత తీర ప్రాంతాలు దాటి తెలంగాణలోని ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్ జిల్లాల్లోని అభ‌యార‌ణ్యం వైపు వస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇక్కడి అడవుల్లో శాకాహార జంతువులు అధికంగా ఉండడం వాటికి కలిసివస్తోందని అంటున్నారు.

హాని తలపెడితే శిక్ష తప్పదు..

వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్యప్రాణులను వేటాడితే కఠిన శిక్షలు విధిస్తారు. పులిని ఆట పట్టించినా, భయపెట్టినా ఆరు నెలల శిక్ష పడుతుంది. వేటాడితే నాన్ బెయిలబుల్‌ కేసు నమోదవుతుంది. మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. పులి నివాసం ఉండే అభయారణ్యంలోని కోర్‌ ఏరియాల్లో వేటాడితే 3 నుంచి 7 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. వేటాడినట్లు ఆధారాలుంటే వారెంటు లేకుండానే అరెస్టు చేయొచ్చు. అటవీ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటారు.

ఈ మార్గంలోనే గోదావరి తీరం దాటి ..

ఛత్తీస్‌గఢ్‌ కీకారణ్యం నుంచే పెద్దపులి ఓరుగల్లులోకి ప్రవేశించించిన‌ట్టు తెలుస్తోంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చెలిమల, డోలి అభయారణ్యం మీదుగా కొత్తగుంపు, బోదాపురం అటవీ మార్గంలో గోదావరి తీర ప్రాంతంలోకి చేరుకున్నట్లు అటవీశాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఇక్కడి పాదముద్రల (ప‌గ్‌మార్క్స్‌) ఆనవాళ్ల ఆధారంగా ఆ మార్గమే రాకకు సులువైనదిగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇక‌.. బోదాపురం సమీప పెద్దలంక భూముల్లో సాగు చేస్తున్న పుచ్చపంటల మీదుగా దాదాపు ఐదుకు పైగా చిన్ననీటి పాయలు దాటి గోదావరి ప్రవాహం వైపు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఆ నదిని కూడా దాటినట్లు ఆవలి ప్రాంతమైన మంగపేట మండలం చుంచుపల్లి, రాజుపేట ప్రాంతాల్లో పాదముద్రలను అటవీశాఖ గుర్తించింది. ఇట్లా.. మల్లూరు అడవుల్లోకి ప్రవేశించి ఉండొచ్చనేది అటవీశాఖ అభిప్రాయం.

మగ పులిగా అనుమానం

ఈ ప్రాంతంలో సంచరిస్తుంది మగ పులిగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పాదముద్రల ఆనవాళ్ల ఆధారంగా ఆరేండ్ల వయస్సు పైబడి ఉండొచ్చని అంచనా. కొత్త ఆవాసం, తోడు, ఆహారం కోసం రోజూ 40 నుంచి 60 కిలోమీట‌ర్ల దాకా ఈ పులి ప్రయాణిస్తుందని అధికారులు అంటున్నారు. పెద్ద పులుల సంచారంతో కుమురంభీం, ములుగు జిల్లాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున కుమురంభీం జిల్లా సిర్పూర్‌(టి) మండలంలోని హుడ్కిలి గ్రామంలో రైతు దంద్రే రావూజీ ఇంటి వద్ద కట్టేసిన దూడపై పులి దాడి చేసింది. అటవీ అధికారులు అక్కడి పాదముద్రలను పులివేనని నిర్ధారించారు. అదే పులిని మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వేంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద, సాయంత్రం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు మాకిడి రైల్వే కేబిన్‌ సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా స్థానికులు గుర్తించారు.

ములుగు జిల్లాలో మ‌రో పులి..

ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోదాపురం, ఆలుబాక సమీపంలోని గోదావరి లంకలోనూ మంగళవారం మ‌రో పులి సంచరించింది. బోదాపురం రైతు కొర్స నర్సింహారావు పుచ్చ పంట సాగు చేస్తున్నారు. సోమవారం రాత్రి పంటకు రక్షణగా వెళ్లి అక్కడ వేసుకున్న పాకలో నిద్రించారు. అర్ధరాత్రి పులి గాండ్రింపులు వినిపించాయి. మంగళవారం ఉదయం అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పాదముద్రల ఆనవాళ్లను గుర్తించారు.

మంగ‌పేట మండ‌లంలోకి..

ఒక్కో పాదముద్ర 5.5 అంగుళాల పొడవు, దాదాపు అంతే వెడల్పు విస్తీర్ణంలో ఉన్నాయని, వెంకటాపురం ఎఫ్‌ఆర్‌వో చంద్రమౌళి తెలిపారు. కొండాపురం-బోదాపురం మధ్య జిన్నెలవాగు (కొండాపురంవాగు) గోదావరిలో కలిసే ప్రాంతం నుంచి లంక భూముల మీదుగా సుమారు 4 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రయాణించిన పెద్దపులి నదిని దాటి మంగపేట మండలం చుంచుపల్లి వైపు వెళ్లినట్లు ఆనవాళ్లు స్పష్టం చేస్తున్నాయని ఎఫ్ఆర్‌వో తెలిపారు.

గతంలోనూ ఇలాగే..

2020 ఆగస్టులో కన్నాయిగూడెం మండలం భూపతిపూర్, చిట్యాల అడవుల్లో తొలిసారి పులి అడుగులు కనిపించాయి. = 2021 నవంబర్‌లో మంగపేట మండలం కొత్తూరు-మొట్లగూడెం మీదుగా భద్రాద్రి కొత్తగూడెం అడవుల్లోకి పులి వ‌చ్చింది.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

పెద్దపులి సంచరించిన తీరం వైపు ఒంటరిగా వెళ్లొద్ద‌ని, చేతిలో కర్రలతో రక్షణగా గుంపులుగా తిరగాల‌ని అట‌వీశాఖ అధికారులు అంటున్నారు. సమీప అడవుల్లోకి మూగజీవాలను మేతకు వదలొద్ద‌ని, పంట క్షేత్రాల వద్దకు సమూహంగా వెళ్లాల‌ని తెలిపారు. పులి కనపడితే పరుగులు తీయొద్ద‌ని, ఎదురుగా వచ్చినా ధైర్యంగా ఉండాల‌ని అంటున్నారు. తల వెనుక వైపు మాస్కులు పెట్టుకోవడంతో పులి గమనింపులో మార్పు వస్తుంద‌ని, పొలం ప‌నుల‌కు వెళ్లిన వారు సాయంత్రం 5 గంటల లోపు త‌మ ఇండ్ల‌కు చేరుకోవాల‌ని జాగ్ర‌త్త‌లు సూచించారు.

Exit mobile version