రాష్ట్ర సహకార బ్యాంకు పదవులకు రాజీనామా చేసిన కొండూరి రవీందర్రావు, గొంగిడి మహేందర్రెడ్డిలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అవసరమైతే పదవులు వదులుకోవాలని నేర్పిన కేసీఆర్ బాటలో నడుస్తూ.. పదవులకు రాజీనామా చేసిన వారి నిర్ణయం అభినందనీయమన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరి పదవులు కాపాడుకోవాలని ఎన్ని ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా నమ్ముకుని నడిచిన గులాబీ పార్టీ, కేసీఆర్ బాటకే జైకొట్టారని గుర్తు చేశారు. తమ హయాంలో రాష్ట్రంలోని సహకార బ్యాంకులను అద్భుతంగా నిర్వహించారని, రాష్ట్ర సహకార రంగ చరిత్రలో వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని కేటీఆర్ అన్నారు. పది వేల కోట్ల రూపాయల అప్పులున్న టెస్కాబ్ ను రూ.42 వేల కోట్ల కంపెనీగా మార్చారని, కస్టమర్ల సంఖ్యతో పాటు డిపాజిట్లు మూడు రెట్లు పెరిగి నమ్మకమైన సంస్థలుగా తీర్చిదిద్దారని కొనియాడారు.
టెస్కాబ్ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపి, అనేక అవార్డులతో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్ర సహకార బ్యాంకుగా నిలిపారని. వీరి రాజీనామాలు, నాయకత్వ లోపం రాష్ట్ర సహకార రంగానికి తీరని లోటు అవుతుందని అన్నారు. అత్యుత్తమంగా పనిచేస్తున్న ప్రజాప్రతినిధులను కుట్రపూరితంగా పక్కకు తప్పించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.