స్కేలీ థ్రష్ సరికొత్త జర్నీ ఇదే..
వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం
444 వైవిధ్య పక్షుల జాబితాలో చేరిక
తెలంగాణకు వచ్చిన అరుదైన అతిథి
భీముని పట్నం జలపాతంలో సయ్యాట
హిమాలయాల్లోనే కనిపించే అరుదైన పక్షి ఇది
సంతోషం వ్యక్తం చేస్తున్న పక్షి ప్రేమికులు
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: తెలంగాణలో వింత పక్షి కనిపించింది. హిమాలయాల్లో ఉండే ఈ పక్షి చలికాలంలో అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక తెలంగాణలో విడిది కోసం వచ్చింది.. ఇక.. వలస పక్షులకు దారిని చూపే మార్గదర్శిగా ఉంటోందని పక్షి పరిశీలకులు చెబుతున్నారు. వేలాది కిలోమీటర్ల ప్రయాణానంతరం మహబుబాబాద్ జిల్లా భీమునిపట్నం జలపాతంలో కనిపించింది. దక్షిణాది రాష్ట్రాల్లో తొలి వీక్షణ పక్షిగా శాస్త్రవేత్తలు కితాబు ఇస్తున్నారు. కాగా, ఈ పక్షిని స్కేలీ థ్రష్గా చెబుతున్నారు.
గూడూరు రిజర్వ్ ఫారెస్టులో..
బహూశ హిమాలయాల నుంచి వచ్చిందో.. లేక ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిందో.. తెలంగాణలోని పక్షివైవిధ్య వేదికలో మరో కొత్త జాతి చేరింది. దక్షిణ భారతదేశంలోనే ఈ పక్షిని తెలంగాణ గడ్డ వీక్షించిందని చెబుతున్నారు. దీన్ని అధికారికంగా ధ్రువీకరించడానికి పరిశీలు డేటాను తనిఖీ చేస్తున్నారు. తెలంగాణ పక్షుల శాస్త్రవేత్త శ్రీరామ్‌రెడ్డి ఇటీవల మహబూబాబాద్ జిల్లా గూడూరు రిజర్వ్ ఫారెస్ట్‌లోని భీముని పాదం జలపాతం వద్ద ఈ పక్షిని చూశారు. కాగా, తెలంగాణకు వచ్చే అతిథి పక్షులకు స్కేలీ థ్రష్ మార్గదర్శిగా ఉంటోందని ఆయన అన్నారు.
విడిదికోసం..
హిమాలయాలలో కఠిన వాతావరణం నుంచి తప్పించుకునేందుకు ఈ పక్షులు శీతాకాలంలో దక్షిణం వైపు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్నాళ్లు ఇతర ప్రాంతాల్లో విడిది తీరుతాయి. వన్యప్రాణుల ఫొటోగ్రాఫర్ ఈ థ్రష్ను చూసినప్పుడు వెదురు చెట్ల కింద ఆకుల్లో ఏదో అలికిడిని గుర్తించి ఫొటో తీశారు. తెలంగాణలో తాను గతంలో చూసిన థర్ష్ పక్షులను పోలిన ఈ పక్షి గురించి తెలియజేశారు. ఎనీ హౌ ఈ స్కేలీ థ్రష్ రాకతో… తెలంగాణలోని 444 వైవిధ్య పక్షుల జాబితాలో చేరిపోయింది. నిపుణులతో మాట్లాడి, కుటుంబంలోని మిగిలిన పక్షుల ఫోటోలను పోల్చి చూసిన తర్వాత, రాష్ట్రంలో వీక్షించిన సుదీర్ఘ జాబితాలో కొత్త పక్షి జాతిని చేర్చినట్లు నిర్ణయానికి వచ్చానని రెడ్డి చెప్పారు.