Thursday, November 21, 2024

TG: అద్దె చెల్లించలేదని గురుకులాల గేట్లకు తాళం..


-తొర్రూరులో ఘటన
తొర్రూరు : ఆయా గురుకులాల భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించడం లేదని యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 నెలలుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు బకాయిలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ గురుకులాల భవన యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని పలు గురుకుల పాఠశాలల గేట్లకు తాళాలు వేసి యజమానులు నిరసన తెలిపారు.

పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల, మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల, మండలంలోని నాంచారి మడూరులోని జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల డిగ్రీ కళాశాల, ఎస్టీ, ఎస్సీ, బీసీ హాస్టళ్ల‌కు యజమానులు మూసివేసి నిరసన తెలిపారు. దీంతో విధులకు హాజరయ్యేందుకు వచ్చిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు అక్కడే నిరీక్షించారు.

- Advertisement -

ఈ సందర్భంగా గురుకుల పాఠశాలల అద్దె భవనాల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనుమాండ్ల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ… 8 మాసాలుగా ప్రభుత్వం అద్దె చెల్లించకపోతే తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని ఎనిమిది మాసాలు వేచి చూసామని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం చెల్లించకుండా అద్దె బకాయిల చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తుందన్నారు.

పాఠశాల భవనానికి నెలకు రూ.3 లక్షలు (8 నెలలకు రూ.24 లక్షలు), కళాళాల భవనానికి నెలకు రూ.4,50,601 (8 నెలలకు రూ.36,04,808) చొప్పున పెద్ద మొత్తంలో అద్దె చెల్లించాల్సి ఉందన్నారు. ప్రతి నెలా అదే బకాయిలు చెల్లించాలని అనేక మార్లు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం తమ వినతులను పట్టించుకోవడం లేదన్నారు. బకాయిలు చెల్లించకుంటే నిరసన కొనసాగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement