ఒక్క రోజు పర్యటనకు సూర్యాపేట వచ్చిన జిష్ణుదేవ్ వర్మ
ఘన స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్
కవులు, కళాకారులతో సమావేశం
ఆంధ్రప్రభ స్మార్ట్, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమీక్షించారు. గురువారం
జిల్లాలో ఒక్క రోజు పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూర్యాపేట కలెక్టరేట్ వద్దకు ఉదయం పదిన్నర గంటలకు చేరుకున్నారు. తొలుత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్ లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించారు. అనంతరం జిల్లాలోని వివిధ రంగాల్లోని రచయితలు, కవులు, కళాకారులు, అవార్డు గ్రహీతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కవులు, కళాకారులు, అవార్డు గ్రహీతలు మాట్లాడారు.
గవర్నర్‌కు ఘన స్వాగతం
సూర్యాపేట చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు మంత్రి ఉత్తమ్ కుమార్, అధికారులు ఘన స్వాగతం పలికారు. గవర్నర్ కారుదిగిన వెంటనే రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అలాగే జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ తో పాటు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు పుష్ప గుచ్చాలు అందజేశారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ఫోటోలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తిలకించారు. అలాగే అంగన్‌వాడీలు, మహిళ సంఘాలు తయారు చేసిన పౌష్టికాహార పదార్థాల శిబిరాన్ని ఆయన సందర్శించారు.
జిల్లా అభివృద్ధిపై సమీక్ష
సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ , అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి గురించి తొలుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. అనంతరం కలెక్టర్ తేజాస్ చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి నివేదిక ఇచ్చారు.